Kranthi: ప్రకాష్ రాజ్‌ గారితో నటించాలంటే చచ్చేంత భయం

Kranthi: నిజం చెప్పాలంటే ప్రకాష్‌ రాజ్‌ గారితో కలిసి నటించాలంటే తనకు చాలా భయం అని ప్రముఖ నటి క్రాంతి బలివాడ అన్నారు. ఆయన్ని చూస్తే ఎవరైనా భయపడాలన్న ఆమె, అతని టాలెంట్, మెమొరీ గురించి గొప్పగా చెప్పారు. ఇకపోతే ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పాలంటే ఆయనకు ఓ సీన్‌ పేపర్‌ బంచ్‌ను ఇచ్చినట్టయితే, అందరితో కబుర్లు చెపుతూ, ఒక టేబుల్ వేసుకొని అందర్నీ చుట్టూ కూర్చోబెడతారని క్రాంతి తెలిపారు. అందరితో మాట్లాడుతూనే చేతిలో ఉన్న పేపర్లను పట్టుకొని, జస్ట్ అలా తిప్పేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.

నిజం చెప్పాలంటే ఆయన తెలుగు కాదు కానీ, చదవడం మాత్రం వచ్చని ఆమె అన్నారు. ఇక అలా పేపర్లు తిప్పేసి వెంటనే తిరిగి ఇచ్చేస్తారన్న ఆమె, షాట్‌కి వెళ్లగానే టకా టకా డైలాగ్స్ చెప్పేస్తారని ఆమె తెలిపారు. ఆయన అలా షాట్‌ ఓకే అనగానే ఏ పంచ్ వేస్తారో తెలియదని, అలా ఏ పంచ్ వేసిన తరువాతి డైలాగ్ చెప్పడానికి తాము రెడీగా ఉండాలని ఆమె అన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఆయనతోనే కాదు సీనియర్లతో చేసిన ప్రతీసారి అలాంటి భయమే కలుగుతుందని ఆమె స్పష్టం చేశారు. తనకేమో మనవల్ల షాట్ ఫెయిల్ కాకూడదు అని ఉంటుందని క్రాంతి అన్నారు.

అలా ఫెయిల్‌ అవడం లేదా ఎక్కువ టేక్‌లు తీసుకున్న సందర్భాలు ఇప్పటివరకైతే లేవని ఆమె చెప్పారు. తాను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవడం వల్ల అలాంటి సమస్య తాను ఎదుర్కోలేదని ఆమె అన్నారు. అందుకే షూట్ అనగానే ముందుగానే తాను ప్రిపేర్ అవుతానని, ఎందుకంటే ఒక్కోసారి సీనియర్లతో చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందే తనకు తాను రెడీ అవుతానని క్రాంతి తెలిపారు.