Pawan Kalyan: మీరు ఓట్లు వేయకపోయినా అభివృద్ధి చేస్తున్నాం… నేనే ముఖ్యమంత్రిని కాదు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన విశాఖ, మన్యం జిల్లాల్లో పర్యటన చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా కొంతమంది అభిమానులు సీఎం చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అయితే ఇది గ్రహించిన పవన్ కళ్యాణ్ వెంటనే నేను ముఖ్యమంత్రి చంద్రబాబును కాదమ్మా నేను ఉపముఖ్యమంత్రిని అంటూ చెప్పుకు వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని, నీడ నిస్తుందన్నారు.

అరకు ఒక అద్భుతమైన ప్రాంతమని, దీనిని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన్యం ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక గిరి పుత్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే రోడ్లు వేసి వారి జీవన శైలిని మార్చివేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన గ్రామాల్లో రూ.1500 కోట్లు విలువ చేసే రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తాము ఓట్ల కోసం రోడ్లు వేయడం లేదని తెలిపారు. గత ఎన్నికలలో అరకు ప్రాంతానికి చెందిన ప్రజలు కూటమికి ఓట్లు వేయలేదు. అయినప్పటికీ మేము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాము అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.