Crime News:మన భారతీయ సంస్కృతిలో పెళ్లికి ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది.ఒకసారి వివాహ బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత భార్యభర్తలిద్దరు కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ చివరి శ్వాస వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి పెళ్లి బంధం మూడునాళ్ళ ముచ్చట గా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి భార్య భర్త ల మధ్య మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు తీసుకుని విడివిడిగా ఉండే వారు కొందరైతే.. భార్య భర్త ఒకరి పై ఒకరికి నమ్మకం లేకపోవటం వల్ల అనుమానంతో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే..పొదిలి మండలం, సూదనగుంట రామాపురం గ్రామానికి చెందిన దేశం రమణారెడ్డికి.. దొనకొండ మండలం నారసింహనాయునిపల్లికి చెందిన కెజియాతో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కుమారుడు రేవంత్ ఉన్నాడు. డబ్బు సంపాదనకు రమణారెడ్డి సినిమా థియేటర్ లీజుకు తీసుకొని నడుపుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా రమణారెడ్డి కి భార్య మీద అనుమానం మొదలైంది. ఈ క్రమంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. రమణా రెడ్డి తరచూ భార్యని కొడుతూ వేధిస్తూ ఉండేవాడు. ఈ తరుణంలో ఆదివారం రమణారెడ్డి తన భార్య, కుమారుడు ఇద్దరిని కొట్టి కొడుకుని గొంతు నులిమి చంపటానికి ప్రయత్నించాడు.
అంతటితో ఆగకుండా ఎన్నో రోజులుగా వారిని హతమార్చాలని ప్రణాళికలు వేసుకున్న రమణా రెడ్డి ఇద్దరికీ కరెంటు తీగలు చుట్టి కరెంట్ షాక్ ఇచ్చిన చంపాలని ప్రయత్నించాడు. ఈ ఘటనలో కుమారుడు రేవంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడు బాధను భరించలేక గట్టిగా కేకలు వేయడంతో ఆ అరుపులు విన్న ఇంటి యజమాని అక్కడికి చేరుకున్నాడు. ఇంటి యజమానిని గమనించిన రమణారెడ్డి అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికుల సహాయంతో బాధితులు ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేజియా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.