దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1.00 గంటకు జరగనున్న ఈ అతి పెద్ద వేడుక లో దేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు వర్చువల్ గా హాజరుకానున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో అతికొద్ది మంది కేంద్ర మంత్రులు, అధికారులు ప్రత్యక్షంగా ఇందులో పాల్గొంటున్నారు. ఈ భవనం నమూనాను గుజరాత్ కు చెందిన హెచ్‌సీ సంస్థ రూపొందించింది. పురివిప్పిన నెమలి మాదిరిగా పార్లమెంట్ పైకప్పు ఆకృతి ఉంది.కొత్త పార్లమెంట్ భవనానికి కేవలం భూమిపూజ మాత్రమే నిర్వహించాలని, నిర్మాణం లేదా కూల్చివేత పనులు చేపట్టవద్దని కేంద్రానికి సుప్రీంకోర్టు రెండు రోజుల కిందట సూచించిన విషయం తెలిసిందే. దీనితో నేడు కేవలం భూమి పూజ మాత్రమే చేయనున్నారు.
విశాలమైన ఈ భవనంలో లోక్ సభ సభ్యుల కోసం 888 సీట్లు, రాజ్య సభ సభ్యుల కోసం 326 సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 18.37 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మించే పార్లమెంట్ విస్టా భవనం ప్రాజెక్టు కోసం రూ.11,794 కోట్లుఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అంతకు మందు మొత్తం రూ.11,038 కోట్లు అవుతుందని అంచనా వేసినా.. ప్రస్తుతం అదనంగా మరో రూ.794 కోట్లు పెరిగింది.