NTR: టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో హృతిక్ రోషన్,ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. యశ్ రాజు ఫిలిం సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. స్పై యాక్షన్ త్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులతో పాటు దక్షిణాది సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
ఇద్దరూ స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్,హృతిక్ రోషన్ ల మధ్య హోరాహోరీ పోరాటాలతో పాటు మంచి డ్యాన్స్ మూమెంట్స్ తో నిండిన ఒక పాట కూడా ఉండనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే మే నెలలోనే షూట్ చేయాల్సిన ఆ పాట హృతిక్ రోషన్ కాలికి గాయం అవ్వడంతో ఆలస్యం అయ్యింది. అయితే ఇప్పుడు ఆ పాట చిత్రీకరణ ముంబైలో మొదలైనట్లు తెలుస్తోంది. యశ్ రాజ్ స్టూడియోస్ లో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్ లో ఈ షూట్ కొనసాగుతుందట.
ఈ పాటకు ప్రీతమ్ స్వరాలు అందించగా బాస్కో మార్టిన్ నృత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్లు టాక్. ఇది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గీతమవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విడుదలకు మరొక నెలన్నర మాత్రమే సమయం ఉంది. దీంతో మూవీ మేకర్స్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టాలని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా తారక్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చే పాటకు బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం అని తెలుస్తోంది.