67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇందులో దక్షిణాది సినిమాలకు ఎక్కువ సంఖ్యలో అవార్డులు దక్కాయి. ‘మహర్షి, జెర్సీ, సూపర్ డీలక్స్, అసురన్’ లాంటి సినిమాలు అవార్డులకు ఎంపిక కాగా విజయ్ సేతుపతి, ధనుష్ ఉత్తమ నటులుగా అవార్డులను సాధించారు. అవార్డు సాధించిన ప్రతి సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు వీక్షించిన సినిమానే. కానీ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్’ మాత్రం రిలీజ్ కాకుండానే పలు క్యాటగిరీల్లో జాతీయ అవార్డులను గెలుచుకుంది.
ఈ సినిమాకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డులు లభించాయి. మరి రిలీజ్ కాకుండానే అవార్టులు ఎలా ఇస్తారు అనే అనుమానం అందరికీ వచ్చింది. నిజానికి ఈ సినిమా గతేడాదిలోనే రావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా రిలీజ్ కాలేదు. అయితే గత ఏడాదిలోనే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ చిత్రాన్ని 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించింది. అలా సినిమా జాతీయ అవార్డుల జాబితాలో నిలిచింది. ఇకపోతే ఈ చిత్రాన్ని మే 19న రిలీజ్ చేయనున్నారు. ఆరోజున జాతీయ అవార్డులు పొందేంత స్టఫ్ అందులో ఏముందో ప్రేక్షకులకు తెలుస్తుంది.