ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన, సీఆర్డీఏ బిల్లులపై శానసమండలిలో జరిగిన చర్చ గురించి తెలిసిందే. మండలిలో రూల్ 71 కింద చర్చకు టీడీపీ నోటీసు ఇవ్వగా…మండలి చైర్మెన్ షరీఫ్ చర్చకు అనుమతిచ్చారు. సభలో వాడి వేడిగా జరిగిన ఓటింగ్ లో టీడీపీ పై చేయి సాధించగా..అదే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు చంద్రబాబుకి షాకిచ్చిన సంగతి తెలిసిందే. 71పై జరిగిన ఓటింగ్ లో అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 13 ఓట్లు వచ్చాయి. 9 మంది తట్టస్థంగా ఉన్నారు. ఇందులో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పోతులు సునీత,శివనాథరెడ్డి వైకాపాకు అనుకూలంగా ఓటేసారు. కీలక బిల్లులు మండలికి వస్తాయని టీడీపీ విప్ జారీ చేసినా ఎమ్మెల్సీలు మాత్రం షాక్ ఇచ్చారు.
దీంతో ఇద్దరిపై అనర్హత వేటు పడింది. మరో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శాసనమండలి చైర్మెన్ కు ఫిర్యాదు చేయడం..వాళ్లిద్దరికి శాసనసభా కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు నోటుసులు పంపడం కూడా జరిగింది. అయితే ఆ ఇద్దరు జూన్ 3వ తేదిన సంజాయిషీ ఇవ్వాలని తాజాగా లేఖ రాసారు. ఎట్టిపరిస్థితుల్లో ఆ రోజు తప్పకుండా స్వయానా హాజరై వివరణ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో సునీత, శివనాథ్ రెడ్డిలు శాసనసభ కార్యదర్శికి ఎలాంటి వివరణ ఇస్తారు? అన్న దానిపై ఆసక్తి సంతరించుకుంది. వైకాపాకు ఇప్పటికే జై కొట్టారు. మూడు రాజధానులకు సమ్మతం తెలిపారు. రాష్ర్ట అభివృద్ధికి ఇలాంటి నిర్ణయాలతోనే ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పకనే చెప్పారు.
అనర్హత వేటు విషయం పక్కనబెడితే టీడీపీ అధిష్టానం వాళ్లిద్దరిపై కక్షపూరిత చర్యలకు సిద్దమవుతుంది అన్న వార్తా వేడెక్కిస్తోంది. ప్రస్తుతం రాష్ర్టంలో చోటు చేసుకుంటోన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకిది మరొక భంగపాటు అని చెప్పొచ్చు. అటు ఎమ్మెల్యేల జంపింగ్ కు సంబంధించి కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. అదే జరిగితే టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించిన టీడీపీ పూర్తిగా కనుమరగయ్యే అవకాశం లేకపోలేదు.