Tammareddy Bharadwaja: ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు లేవంటున్నారు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అసలు టికెట్ల రేట్ల విషయం పెద్ద సమస్య కాదని అంటున్నారు.
టాలీవుడ్, ఏపీ సర్కార్ మధ్య టికెట్ రేట్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా సాగుతున్న ఈ సమస్యలకు ఇటేవలే ఫుల్ స్టాప్ పడేలా.. టాాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, అలీ, పోసాని వంటి ప్రముఖులు సీఎం జగన్ లో భేటీ అయ్యారు. ఈ భేటీలో సర్కార్ నుంచి సమస్యల పరిష్కారంపై హామీ వచ్చింది. దీన్ని మీడియా ముఖంగా.. సినీ ప్రముఖులు వెల్లడించారు. రానున్న కొన్ని రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వాళ్లు వెల్లడించారు.
అయితే ఇండస్ట్రీలో ఏం సమస్యలు లేవని.. తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు. టికెట్ రేట్ ఇష్యూ అసలు సమస్యే కాదని.. అసలు ఇండస్ట్రీ సభ్యులు ప్రభుత్వం దగ్గరకు ఎందుకు వెళ్లారో తనకి అర్ధం కావడం లేదని అంటున్నారు తమ్మారెడ్డి. సీఎంల దగ్గర ప్రదక్షిణాలు చేసేవాళ్లకు ఏదైనా సమస్య ఉందేమో కానీ ఇండస్ట్రీలో మాత్రం ఎలాంటి సమస్య లేదని అన్నారు తమ్మారెడ్డి.
పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు టికెట్ రేట్ ఒకటే ఉండడం సమస్య అని అంటున్నారని.. అలా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు తమ్మారెడ్డి. పెద్ద సినిమాల పేరుతో ఊర్లో ఉన్న థియేటర్లన్నీ కబ్జా చేసి ఇంకా రేట్లు పెంచమని అడగడం అంటే.. జనాల డబ్బులను దోచుకున్నట్లే అని.. అన్నారు. ఆర్ నారాయణ మూర్తి సినిమా వస్తే కేవలం 60-70 థియేటర్లలో విడుదల చేస్తారని… అదే పెద్ద సినిమా వస్తే థియేటర్లు కూడా ఖాళీ ఉండవని..అలాంటప్పుడు థియేటర్ల గురించి కూడా మాట్లాడాలి కదా అని అన్నారు. ‘అఖండ’కి లేని సమస్య, ‘పుష్ప’కి లేని సమస్య.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, డీజే టిల్లుకి లేని సమస్య మీకేంటి..? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.