ఆస్ట్రేలియా గడ్డపై భార‌త్ జోరు.. టీ 20 సిరీస్ ద‌క్కించుకున్న టీమిండియా

వ‌న్డే సిరీస్ కోల్పోయిన భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది. ఓడిన చోట గెలిచి తామెంటో ఆతిథ్య జ‌ట్టుకు చూపించింది. ఆదివారం జ‌రిగిన రెండో టీ20లో భాగంగా ఆస్ట్రేలియా విధించిన 195 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా చేధించింది. ముఖ్యంగా హార్ధిక్ పాండ్యా వీర‌విహారం చేయ‌డంతో ఆరు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. వన్డే సిరీస్‌లో మొద‌టి రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్ కోల్పోయిన భార‌త్ మూడో వ‌న్డేలో విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత జ‌రిగిన మొద‌టి టీ 20లోను ఘ‌న విజ‌యం సాధించింది. ఇక ఈ రోజు 195 ప‌రుగుల‌ని కూడా సులువుగా చేజ్ చేసి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ని సొంతం చేసుకుంది. చివ‌రిదైన మూడో టీ 20 డిసెంబ‌ర్ 8న జ‌ర‌గ‌నుంది.

195 పరుగుల ల‌క్ష్యాన్ని చేధించే క్ర‌మంలో బ్యాటింగ్‌కు దిగిన ధావ‌న్ ( 36 బంతుల్లో 52, 4 ఫోర్లు, 2 సిక్స్‌), రాహుల్ (22 బంతుల్లో 30, 2 ఫోర్లు, 1 సిక్స్) మొద‌ట్లో కాస్త త‌డ‌బడిన ఆ త‌ర్వాత ప‌రుగుల వ‌ర‌ద పారించారు. 50 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన కొద్ది సేప‌టికే రాహుల్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత ఒక్కొక్క‌రుగా క్యూ క‌ట్టారు. కోహ్లీ (24 బంతుల్లో 40, 2 ఫోర్స్ , 2 సిక్స్), సంజూ శాంస‌న్ (10 బంతుల్లో 15) మెరిపించిన ఎక్కువ సేపు నిల‌వ‌లేక‌పోయారు. చివ‌రిలో హార్దిక్ పాండ్యా(22 బంతుల్లో 42, 3 ఫోర్స్, 2 సిక్స్), శ్రేయాస్ అయ్య‌ర్ (5 బంతుల్లో 12 రన్స్, 1 ఫోర్, 1 సిక్స్) అద్భుతంగా ఆడ‌డంతో భార‌త్ భారీ ల‌క్ష్యాన్ని సునాయాసంగా చేధించింది

బ్యాటింగ్‌కు అనుకూల‌మైన పిచ్‌పై ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ కూడా చెల‌రేగి ఆడారు. ముఖ్యంగా తాత్కాలిక కెప్టెన్ మాథ్యూవెడ్ (58: 32 బంతుల్లో 10×4, 1×6) రెచ్చిపోయి ఆడాడు. అయితే అత‌ను ఇచ్చిన క్యాచ్‌ని కోహ్లీ మిస్ చేసిన అదే స‌మ‌యంలో రనౌట్‌గా వెనుదిరిగాడు.ఇక మంచి ఫాంలో ఉన్న స్టీవ్‌స్మిత్ (46: 38 బంతుల్లో 3×4, 2×6) ఈ మ్యాచ్‌లోను అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ (22), హెన్రిక్యూస్ (26), స్టాయినిస్ (16 నాటౌట్) క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడేశారు. దీంతో ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో నటరాజన్ 20 ప‌రుగుల‌కు రెండు వికెట్స్ తీయ‌గా, చాహల్ (1/51) ధారాళంగా పరుగులిచ్చాడు. దీపక్ చాహర్ (0/48), వాషింగ్ట‌న్ సుంద‌ర్( 0/35),శార్దూల్ ఠాకూర్( 1/39) తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు. భార‌త పేల‌వ‌మైన ఫీల్డింగ్ వ‌ల‌న కూడా ఆస్ట్రేలియా 194 ప‌రుగుల టార్గెట్‌ని విధించింది.