రాష్ర్టంలో ప్రభుత్వం దివాళా తీసిందా? భూములు ఆస్తులు అమ్మితే గానీ ప్రభుత్వాన్ని నడపలేరా? ఆస్తులు అమ్మి అభివృద్ది కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా? అని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టుల సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి పలు అంశాల విషయంలో హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడం అలవాటైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ఆస్తులు అమ్మి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంపై కోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వ భూములు అమ్మకాలపై గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ బాబు హైకోర్టులో పిటీషన్ వేసిన నేపథ్యంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.
రాష్ర్టంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను బిల్డ్ ఏపీ పేరిట విక్రయించాలని ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆన్ లైన్ వేలం ల్యాండ్స్ వేలం వేస్తున్నారు. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటీషన్ పై హైకోర్టు ఏపీలో వందల కిలోమీటర్లు సముద్రం తీరం ఉందని, అక్కడ ప్రజలు ధనవంతులుగా, ప్రభుత్వం మాత్రం పేదరికంలో ఉందా? అని ప్రశ్నించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ భూముల్ని ఇప్పటికిప్పుడు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ప్రజాప్రయోజనా వ్యాజ్యం తీర్పునకు అనుకూలంగానే భూములు వేలం ఉండాలని స్పష్టం చేసింది. ఉన్న భూములను కాపాడుకోవాల్సింది పోయి…అమ్ముకోవడం ఏంటని సీరియస్ అయింది.
పేదల ఇళ్ల స్థలాల కోసం కొత్త భూములు కొనడం చేస్తూ….మళ్లీ ప్రభుత్వ భూముల్ని అమ్మడం ఏంటని కోర్టు మండిపడింది. రాష్ర్ట ఆదాయం కోసం ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించింది. వీటన్నింటిపై కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోరారు. అనంతరం విచారణ 28 కి వాయిదా వేసారు. ఇప్పటికే హైకోర్టు నుంచి తీవ్ర ఎదురు దెబ్బలు తిన్న ప్రభుత్వానికి మళ్లీ ఇదో కొత్త సమస్య తలెత్తింది. మరి ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా? అదే స్థాయిలో విమర్శలను ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. ఏబీ వెంకటేశ్వరావు కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీష్ వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇంకా పలు అంశాలపై ప్రభుత్వం అత్యున్నత న్యాస్థానం తలుపు తట్టబోతుంది. తాజాగా ఆ జాబితాలో బిల్డ్ ఏపీ కూడా ఉంటుందని తెలుస్తోంది.