కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం పనితీరును హైకోర్టు మొదటి నుండి గమనిస్తూనే ఉంది. లాక్ డౌన్ సమయంలో తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు కనిపించినా ఆ తర్వాత మెల్లగా దిగజారుతూ వచ్చింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతూ పోతున్నాయి కానీ వైరస్ నిరర్థారణ పరీక్షల సంఖ్య పెరగలేదు. మొదట్లో రోజుకు 1000, 1500 టెస్టులు మాత్రమే జరిగేవి. దీంతో కొందరు కోర్టుల్లో ప్రభుత్వం పనితీరు సరిగా లేదని పిటిషన్లు వేశారు. విచారించిన హైకోర్టు మొదట్లో నెమ్మదిగానే ప్రశ్నించింది. పరీక్షల సంఖ్య పెంచమని సూచించింది. కేసుల వివరాల్లో గొప్యత వద్దని చెప్పింది. కానీ ప్రభుత్వం కోర్టు సూచనలను లైట్ తీసుకుంది.
చెప్పిన వాటిలో ఒక్కదాన్ని కూడా సరిగా ఫాలో కాలేదు. టెస్టుల సంఖ్య పెంచలేదు. హెల్త్ బులిటెన్లను సరిగా రిలీజ్ చేయలేదు. దీంతో న్యాయస్థానం సీరియస్ అయింది. నిర్లక్ష్యం తగదని, టెస్టులను పెంచమని ఆదేశించింది. అయినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. చివరికి హైకోర్టు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందని, ప్రజలే ప్రాణాలను కాపాడుకోవాలని వ్యాఖ్యానించింది అంటే సర్కార్ అలసత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కోర్టు ఇంతలా హెచ్చరించినా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ న్యాయ వ్యవస్థకు సరైన వివరణ ఇవ్వలేదు.
పైగా కరోనా పై పోరాటంలో ప్రభుత్వ పనితీరు బాగుందని అభినందించినట్టు హెల్త్ బులిటెన్లో పేర్కొంది. దీంతో హైకోర్టు మరింత సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారి మీద ప్రభుత్వం ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తూ కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఓ వైపు మొట్టి కాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని నిలదీసింది. కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం ప్రభుత్వం నిద్రపోతూ ప్రజలను గాలికి వదిలేసిందని, బులిటెన్, బెడ్ల వివరాలను అధికారులు కావాలనే దాచిపెడుతున్నారని మండిపడింది.