ఏపీ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది కేంద్రం స్పష్టం చేసింది. తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని తెలిపింది. తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం పేర్కొంది. హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని వివరించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదన పంపారని తెలిపింది. హైకోర్టు తరలింపునకు ఎలాంటి గడువూ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా? అని బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ రాజధానిగా కర్నూలు.. శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అయితే రాజధాని తరలింపుపై అడుగులు వేయగా.. కోర్టుల్లో పిటిసన్లు దాఖలు చేయడంతో ఆ ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వం మాత్రం వీలైనంత త్వరగా తరలించాలనే ఉద్దేశంతో ఉంది.