Hero Venkat: చిరంజీవి అన్నయ్య సినిమా తర్వాత నేను చేసిన తప్పు వల్ల ఇన్ని రోజులు మీకు దూరమయ్యాను: హీరో వెంకట్

Hero Venkat: చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో నటించిన తర్వాత తాను మరిన్ని సినిమాలు చేస్తానని చాలా మంది ఎదురు చూశారని అని హీరో వెంకట్ అన్నారు. దానికి ప్రత్యేకమైన కారణమంటూ ఏం లేదని, ఆ సినిమా తర్వాత కొన్ని మూవీస్‌ చేసినా కూడా అవి అంతగా ఆడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరీరలో మొదటి సినిమా హిట్ అయినా కూడా అన్నయ్య సినిమా తనకు చాలా పేరును తీసుకొచ్చిపెట్టాయని వెంకట్ చెప్పారు. దానికి కారణం కచ్చితంగా చిరంజీవి గారే అని, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగే దానికి కారణమని ఆయన స్పష్టం చేశారు.

ఆ తర్వాత రామోజీరావు ప్రొడక్షన్‌లో వచ్చిన ఆనందం కూడా చాలా పెద్ద హిట్ అయిందని వెంకట్ అన్నారు. ఆ తర్వాత శివరామరాజు లాంటి సూపర్ గుడ్ ఫిలింస్ కూడా తనకు మంచి ఇమేజ్‌ను తీసుకొచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని బాగా హిట్ అయిన సినిమాలున్నాయి. దాంతో పాటు ఫ్లాఫ్ అయిన సినిమాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఫ్లాఫ్ సినిమాల ప్రభావం తరువాత వచ్చే సినిమాలపై కచ్చితంగా ఉంటుందని వెంకట్ తెలిపారు.

అన్నయ్య సినిమా తర్వాత కూడా తాను మళ్లీ కంటిన్యూ అయితే బాగుండేదేమో. కానీ ప్రతి ఒక్కరికీ వారి సొంత జర్నీ అనేది ఒకటుంటుందని వెంకట్ అన్నారు. కానీ కొన్ని సార్లు అప్పుడు జరగనిది ఇప్పుడు అయ్యే అవకాశం ఉండొచ్చని, ఎందుకంటే టెక్నాలజీతో పాటు చాలా మార్పులు వచ్చాయని ఆయన చెప్పారు. ఒకవేళ అదే గనక జరిగితే దాన్ని సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చా అన్న దానికి ఆయన నో అని చెప్పారు. ఎందుకంటే తాను దూరంగా వెళ్లిపోలేదని, ఏదో ఒక విధంగా కంటిన్యూ అవుతూనే ఉన్నానని, కాకపోతే కొంచెం గ్యాప్స్ వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు తనకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉందని, ఎందుకంటే కొత్త యాక్టర్స్‌తో, కొత్త డైరెక్టర్స్‌తో కలిసి పనిచేస్తున్నానని, కొత్త టెక్నాలజీలో వర్క్ చేస్తున్నందుకు అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.