మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు నరేష్‌కి కోసమొచ్చింది. సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి హేమ మధ్య ఎందుకీ రచ్చ చోటు చేసుకుంది.? నిజానికి, హేమ మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదు. ‘మా’ అసోసియేషన్‌కి వున్న నిధుల్ని ఎవరైనా ఖర్చు చేయగలరు.. అదనంగా నిధులు తెచ్చి కదా ఖర్చు చేయాలి.? అన్నది హేమ వాదన. నరేష్ లాంటి స్టార్‌డమ్ వున్నవాళ్ళు, అసోసియేషన్ కోసం అదనంగా నిధులు తీసుకురావాల్సి వుంది. కానీ, అసోసియేషన్ నిధుల్నే ఊడ్చేశారు. అలాగని, వాళ్ళేదో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని హేమ ఎక్కడా ఆరోపించలేదు. కానీ, హేమ వ్యాఖ్యల పట్ల నరేష్ గుస్సా అయ్యారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నరేష్ చెప్పుకొచ్చారు. ‘మా’ ప్రతిష్ట మసకబారిందని నాగబాబు ఆరోపిస్తే, దానికి నరేష్ తీవ్రంగా కలత చెందారు.
అసలు నరేష్ ఏం చెప్పదలచుకుంటున్నట్టు.? ‘మా’లో అంతా సక్రమంగానే వుందని ఆయన చెప్పదలచుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ‘మా’ ఎన్నికలు వీలైనంత త్వరగా జరగడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది. లేకపోతే, వివాదాలు మరింత ముదిరి పాకాన పడిపోతాయి. వెయ్యిమంది కూడా సభ్యులు లేని ‘మా’ అసోసియేషన్ చుట్టూ ఇన్ని వివాదాలా.? ఎన్నికల కోసం ఇంత హంగామానా.? సినీ పరిశ్రమలో బోల్డంతమంది స్టార్లున్నారు.. వాళ్ళతో అసోసియేషన్ కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తే, కోట్లు వచ్చి పడతాయి. వాటితో ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఖర్చు చేయొచ్చు. కానీ, అలా జరగడంలేదు. అందుకు, ‘మా’ రాజకీయాలే కారణం కావొచ్చు. నరేష్ ఇక్కడెవరి మీదా కోపం ప్రదర్శించి ప్రయోజనం లేదు. వారి మీద చర్యలు, వీరి మీద చర్యలు.. అంటూ నరేష్ రచ్చకెక్కడం వల్ల ఎవరికి ప్రయోజనం.?