Gundu Sudarshan: ఏవీఎస్, తాను ఇద్దరం ఇండస్ట్రీకి ఒకే టైంలో వచ్చామని కమెడియన్ గుండు సుదర్శన్ తెలిపారు. కానీ ఆయనకు వచ్చినంత ఇమేజ్, పాపులారిటీ తనకు రాలేదని, దానికి కూడా కారణం ఉందని ఆయన అన్నారు. ఏవీఎస్ ప్రత్యేకించి సినిమాల్లోకి రావాలనుకున్న వ్యక్తి అని, అంతే కాకుండా అతను ఒక జర్నలిస్ట్ అని కూడా సుదర్శన్ చెప్పారు. ఆయనకు ఇంగ్లీష్ రావడం అనేది కూడా చాలా ప్లస్ అయిందని, ఎందుకంటే ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారని ఆయన చెప్పారు. అలా ఆయనకు సెలబ్రెటీలతో పరిచయం ఉండేదని ఆయన స్పష్టం చేశారు.
అలా సినీ పెద్దలతో, ప్రముఖులతో ఉన్న పరిచయంతో, జర్నలిస్ట్ మిత్రుల సహకారంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారని సుదర్శన్ తెలిపారు. మొదటి సినిమా హిట్ కొట్టడంతో ఆయన అక్కడితో ఆగకుండా అదే ప్రస్థానంగా భావించి, కెరీర్‌ని బిల్డ్ చేసుకున్నారని ఆయన చెప్పారు.
ఇకపోతే తన విషయానికొస్తే తానెప్పుడూ కథలో మార్పుల కోసం అడగలేదని, ఈ మధ్య కాలంలో కొంచెం డైరెక్టర్‌ని చూసి అడుగుతున్నా గానీ, ఒకప్పుడైతే వాళ్లు ఏం చెప్తే అదే చేసేవాడినని సుదర్శన్ తెలిపారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాకనే తనకు మంచి పాత్రలు వస్తున్నాయన్న ఆయన, అంతకుముందు పాత్రలన్నీ ఓ అతిథి పాత్రలు గానే అనిపించేవని ఆయన చెప్పారు. తాను ఇప్పటి వరకూ దాదాపు 300కి పైగానే సినిమాలు చేశానని, కానీ బాగా చెప్పుకోదగిన చిత్రాలు మాత్రం ఓ 10,15 ఉంటాయని ఆయన తెలిపారు. చాలా సినిమాల్లో నటించాను గానీ, అది అంత సంతృప్తికరంగా అనిపించేదని ఆయన అన్నారు. తన పాత్ర చాలా సినిమాల్లోనూ ఒకటి, రెండు సీన్లకే పరిమితమయ్యాయని ఆయన చెప్పారు.