Gudivada : వైసీపీని నిండా ముంచేస్తున్న ‘గుడివాడ’.!

Gudivada :  అప్పుడు ‘గుడివాడ’ నియోజకవర్గ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. రెండిట్లోనూ గుడివాడ వుంది. ఎందుకో ఆ ‘గుడివాడ’ కాస్తా గుదిబండగా మారుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. అధినేత ఆదేశాల్లేకుండా గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. తాను మంత్రిగా వున్న సమయంలో చెలరేగిపోయారని అనుకోలేం.

కానీ, హద్దూ అదుపూ లేకుండా కొడాలి నాని అంతలా చెలరేగిపోవడం వైసీపీకి చాలా నష్టం చేసింది. అదేంటన్నది, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తెలుస్తుంది.

ఇక, ఇంకో గుడివాడ.. ఈయన ప్రస్తుత మంత్రి అమర్‌నాథ్. కొడాలి నాని కంటే దారుణంగా తయారయ్యారు. మంత్రి అయ్యాక, తన శాఖకు సంబంధించిన వ్యవహారాలపై సమీక్షలు చేశారో లేదోగానీ, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి చాలానే రీసెర్చ్ చేసినట్టున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కొన్నాళ్ళ క్రితం అమర్‌నాథ్ ఓ ఫొటోకి పోజిచ్చారు. అయితే, తాను ప్రముఖుడిననీ, తనతో చాలామంది ఫొటోలు దిగుతారనీ, అలా పవన్ కళ్యాణ్ కూడా తనతో ఫొటో దిగి వుండొచ్చనీ అమర్‌నాథ్ తేలికపాటి వ్యాఖ్యలు చేశారు.

దీనిపై నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. చాన్నాళ్ళ క్రితం స్వయంగా గుడివాడ అమర్నాథ్, జనసేనాని వద్దకు వెళ్ళి దిగిన ఫొటో అది అని తేలింది. ఇంకేముంది, గుడివాడ అమర్‌నాథ్ మీద నెటిజన్లు విరుచుకుపడటం షురూ అయ్యింది. మంత్రి అయి వుండీ, ఇలా అబద్ధాలు ఆడటమేంటన్నది చాలామంది ఆయన మీద సంధిస్తున్న ప్రశ్న.

పైగా, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వా గుడివాడ, వైసీపీకి చెడ్డ పేరు తెచ్చారన్న చర్చ వైసీపీ వర్గాల్లోనూ జరుగుతుండడం గమనార్హం. మరి, ఈ మొత్తం వ్యవహారంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు.? ఆయనే పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖని గుడివాడకు కట్టబెట్టారని అనుకోవాలా.?