మూడు రాజధానులకు రాజముద్ర పడిపోయింది 

Governor approves three capital bill
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ నిర్ణయం వెలువడింది.  మొదటి నుండి అనుకున్నట్టే బిల్లును ఆమోదిస్తూ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్  నిర్ణయం తీసుకున్నారు.  దీంతో గత రెండు వారాలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.  శాసన సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును మండలి ఆమోదించలేదు.  మండలి నిరవధిక వాయిదా పడటంతో బిల్లును గవర్నర్ ముందుకు పంపారు.  బిల్లు విషయంలో ఎలాంటి రాజ్యాంగ పరమైన చిక్కులూ లేకపోవడంతో ఆమోదం లభిస్తుందని వైసీపీ నేతలు చాలా ధీమాగా ఉంటూ వచ్చారు.  కానీ ప్రతిపక్షం టీడీపీ మాత్రం బిల్లు రాజ్యాంగానికి విరుద్దంగా ఉందని వాదిస్తూ వచ్చింది. 
 
మండలిలో ఆమోదం రాలేదని, కోర్టులో కేసు నడుస్తోందని, రాజధాని కేంద్రం పరిధిలోని అంశమని, విభజన చట్టంలో మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ లేనే లేదని వాదిస్తూ వచ్చింది.  కానీ శాసన మండలి వాయిదా పడింది కాబట్టి డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద బిల్లు ఆమోదం పొందినట్టే లెక్క.  ఇక కోర్టులు శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవు.  కేవలం అవి రాజ్యాంగ పరంగా ఉన్నాయో లేదో మాత్రమే చూస్తుంది.  అందుకే గవర్నర్ బిల్లును నిరాకరించే వీలు లేదని చెబుతూనే ఉన్నాం.  ఆ ప్రకారమే బిల్లుకు రాజముద్ర పడిపోయింది.  
 
బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపాకే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.  దీంతో శాసన ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  ఈ పరిణామంతో వైఎస్ జగన్ ఇకపై వికేంద్రీకరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.  దీంతో అమరావతి శాసన రాజధానిగా, విశాఖ పాలనా రాజధానిగా, కర్నూలు న్యాయపరమైన రాజధానిగా మారనున్నాయి.  గవర్నర్ నిర్ణయంతో ప్రతిపక్షాలకు షాక్ తగిలింది.  రాజధాని అమరావతిని కదల్చనివ్వమని అంటూ వచ్చిన టీడీపీ, జనసేన పార్టీలు ఏం చేస్తాయో చూడాలి.