టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల ‘రాజీనామా’ నాటకాన్ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయనున్నట్లు బుచ్చయ్య చౌదరి లీకులు పంపేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందారు. ప్రస్తుతం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం విదితమే. పార్టీలో తనకు ప్రాధాన్యతనివ్వడంలేదనీ, రాజమండ్రి టీడీపీ తనను గౌరవించడంలేదనీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గత కొంతకాలంగా వాపోతున్నారు. అన్నిటికీ మించి, నారా లోకేష్ నాయకత్వంపై ఆయన ఒకింత అసహనంతో వున్నారనే ప్రచారం జరిగింది.
లోకేష్ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ టీడీపీ బాధ్యతల్ని చేపట్టాలని కోరుతున్నవాళ్ళలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. టీడీపీలో బుచ్చయ్య రాజీనామా ప్రకంపనలు షురూ అయ్యేసరికి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పార్టీ ముఖ్య నేతలంతా కంగారుపడ్డారు. బుచ్చయ్య చౌదరితో వరుస భేటీలు నిర్వహించారు. తాజాగా బుచ్చయ్య, చంద్రబాబుని కలిశారు. అధినేతతో కొంతసేపు ‘ఏకాంతంగా’ చర్చలు జరిపిన అనంతరం, నాలిక మడతేసేశారు బుచ్చయ్య. పార్టీని వీడాలన్న ఆలోచనని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పిన బుచ్చయ్య, పార్టీలో పరిస్థితులపై అధినేతకు వివరించాననీ, ఎవరి మీదా కోపంతో తాను రాజీనామా నిర్ణయం తీసుకోలేదనీ సెలవిచ్చారు. అంతేనా, షరామామూలుగానే జగన్ సర్కారు మీద విమర్శలు చేసేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రస్తుతానికి చంద్రబాబు బుజ్జగింపులు ఫలించాయ్.. కానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీలో తగిన గౌరవం లభిస్తుందని ఎలా అనుకోగలం.?