స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరికి పేటీఎం తెలుసు. పెద్ద నోట్ల రద్దు సమయంలో అందరినీ ఆదుకున్నది పేటీఎమే. అసలు.. పెద్ద నోట్ల రద్దుతోనే డిజిటల్ పేమెంట్స్ గురించి ఎక్కువగా అవగాహన వచ్చింది. అప్పట్లో డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించిన యాప్స్ లో పేటీఎం బాగా ఫేమస్ అయింది. దీంతో దాని రేంజే పెరిగిపోయింది.
ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఆన్ లైన్ కు సంబంధించిన అన్ని లావాదేవీలకు పేటీఎంను ఉపయోగించడం మొదలు పెట్టారు. పేటీఎం యాప్ లో ఫీచర్లను కూడా ఒక్కొక్కటిగా పెంచుతూ వచ్చారు.
అంతవరకు బాగానే ఉన్నది కానీ.. సడెన్ గా గూగుల్.. ప్లేస్టోర్ నుంచి పేటీఎంను తొలగించింది. దీంతో పేటీఎం కస్టమర్లతో పాటుగా.. పేటీఎం యాజమాన్యం కూడా షాక్ తిన్నది. పేటీఎం యాప్ తో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్ ను కూడా ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.
పేటీఎం సంస్థకే చెందిన పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ ను మాత్రం గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించలేదు.
అయితే… గ్యాంబ్లింగ్ నిబంధనలను పేటీఎం యాప్ ఉల్లంఘించిందని.. అందుకే గూగుల్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే.. గ్యాంబ్లింగ్ నిబంధనలకు సంబంధించి గూగుల్ ఇప్పటికే పేటీఎం సంస్థకు నోటీసులు పంపించినప్పటికీ.. దానికి సంబంధించిన నిబంధనలను పేటీఎం మరోసారి ఉల్లంఘించడంతో.. గూగుల్ ఈ చర్యకు ఉపక్రమించింది.
పేటీఎం ఫస్ట్ గేమ్ అనే యాప్ ద్వారా పేటీఎం.. ఫాంటసీ క్రికెట్ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అది ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహించేదిగా ఉండటంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపుపై సంస్థ వెంటనే స్పందించింది. దీనిపై ట్వీట్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్ ను పేటీఎం యాప్ ను కొత్తగా డౌన్ లోడ్ చేసుకోవడానికి కానీ.. అప్ డేట్ చేసుకోవడానికి కానీ కుదరదు. కానీ.. త్వరలోనే సేవలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే పేటీఎంను ఇన్ స్టాల్ చేసుకొని ఉన్న యూజర్లు ఎటువంటి సమస్య లేకుండా యాప్ ను వినియోగించుకోవచ్చు. వినియోగదారుల సొమ్ముకు బాధ్యత మాది. మీ సొమ్ము రూపాయి కూడా ఎటూ పోదు.. అని పేటీఎం ట్వీట్ చేసింది.