జిన్నా ట్రైలర్ రివ్యూ

భాయ్…
జిన్నా భాయ్…
జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదు!
లోడ్ చేసిన గన్ను! జిన్నా భాయ్‌ను టచ్ చేస్తే దీపావళే!!

జిన్నా దీపావళి మామూలుగా ఉండదు. కొడితే ఒక్కొక్కడూ కిందకు పడాల్సిందే. నేల మీదకు ఓరగాల్సిందే. గుండెల నిండా ధైర్యం ఉన్న కుర్రాడు జిన్నా. మంచి అందగాడు కూడా. అతడు అంటే అందాల భామలు పడి చస్తారు. ముద్దు ముచ్చట కోసం ముందుకు వస్తారు. అయితే, జిన్నా మాత్రం ‘ఇదంతా పెళ్లికి ముందు తప్పు కదా!’ అంటాడు. జిన్నా ధైర్యవంతుడు, అందగాడు మాత్రమే కాదు… సంస్కారవంతుడు కూడా! అతడి కథేంటో తెలియాలంటే దీపావళికి ‘జిన్నా’గా విష్ణు మంచు వెండితెరపైకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

విష్ణు మంచు కథానాయకుడి నటించిన తాజా సినిమా ‘జిన్నా’. ప్రద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు ఆశీసులతో AVA ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 24  ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలపై రూపొందుతోంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. సూర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి మూల కథ అందించగా… కోన వెంకట్ స్క్రీన్ ప్లే రాశారు. ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా! దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దసరా పండుగ సందర్భంగా, ఈ రోజు (అక్టోబర్ 5న) ట్రైలర్ విడుదల చేశారు.

‘జిన్నా’ పక్కా కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అనేది ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. విష్ణు మంచు డైనమిక్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించారు. సినిమా కథ ఏంటనేది రివీల్ చేయలేదు గానీ… క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశారు. విష్ణు మంచు టెంట్ హౌస్ ఓనర్‌గా చేశారు. ఆయన నాయనమ్మ పాత్రలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నటించారు.

పెళ్లి కొడుకు పాత్రలో సునీల్, కీలక పాత్రలో ‘వెన్నెల’ కిశోర్, జిన్నా తోడుండే పాత్రలో ‘చమ్మక్’ చంద్ర, ఇతర పాత్రల్లో రఘుబాబు, సద్దాం తదితరులు నటించారు.

జిన్నా అప్పు ఎందుకు చేశాడు? రూబీ ఎవరు? సన్నీ లియోన్‌లో ఆవహించిన దెయ్యం ఎవరిది? జిన్నా ఎవరి కోసం ఫైట్ చేశాడు? వంటి అంశాలను స‌స్పెన్స్‌లో ఉంచారు దర్శకుడు. ‘జిన్నా’ ట్రైల‌ర్‌లో నేపథ్య సంగీతం కూడా బావుంది. వినోదం, అందం, ఉత్కంఠ పెంచే కథనం… సినిమాపై అంచనాలు పెంచాయి. దీపావళికి థియేటర్లలో ఫుల్ పటాస్, టెన్ థౌజండ్ వాలా సౌండ్ గ్యారెంటీ అనే ఫీలింగ్ కలిగించింది.

”అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనాలతో సినిమా రూపొందింది. విష్ణు మంచు పెర్ఫార్మన్స్, ఫైట్స్, డ్యాన్స్ హైలైట్ అవుతాయి. పక్కా మాస్ కమర్షియల్ చిత్రమిది. ఆల్రెడీ రిలీజైన పాటలకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది” అని చిత్ర బృందం తెలిపింది.