గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ తేదీ ఖరారు అయిపోయింది. ఇక మిగిలింది పార్టీలు అభ్యర్థుల్ని వడపోసి టికెట్లు ఇచ్చి బరిలో దించడమే. నూట యాభై కార్పొరేటర్ స్థానాలు వున్న హైదరాబాద్ కార్పొరేషన్లో ప్రస్తుతం టిఆర్ఎస్ కి 99 స్థానాలు, మజ్లీస్ కు 44 స్థానాలు, బీజేపీకి 4, కాంగ్రెస్ కి 2 స్థానాలు, తెలుగుదేశం కి ఒక స్థానం ఉంది.
ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల అవ్వగానే దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద వున్న బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తాము ఒంటరిగా బరిలో దిగుతున్నామని, మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పొత్తు వుంది. అందువల్ల అందరూ కూడా బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తాయని భావించారు. అయితే బండి సంజయ్ నుండి ఈ ప్రకటన రావడం అలాగే అదే సమయంలో పవన్ కళ్యాణ్ తనకు హైదరాబాద్ యువత నుండి కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలనే ఒత్తిడి వస్తుందని వారి అభిమతాన్ని మన్నిస్తూ జనసేన పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించేశారు. ప్రకటనైతే చేశారు కానీ ఒంటరిగా పోటీ చేస్తారా బిజెపితో కలిసి చేస్తారా అని చెప్పలేదు. కానీ సంజయ్ మాటలను బట్టి పవన్ కళ్యాణ్ దుబ్బాక ప్రచారానికి రాలేదు కాబట్టి బిజెపి ఏకపక్షంగా ఒంటరి పోటీ మీద ప్రకటన చేసిందని తెలుస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ విమర్శకులు మాత్రం ఈ వ్యవహారాన్ని మరో లాగా చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి జగన్ అంటే ద్వేషం కాబట్టి జగన్ ని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఎటువంటి పొత్తులకైనా సిద్ధపడతారు కానీ అదే సమయంలో కెసిఆర్ కుటుంబం అంటే పవన్ కళ్యాణ్ కి భయమట. అందుకే కేసీఆర్ గాని ఆయన కుటుంబానికి గాని నష్టం జరిగే పని పవన్ కళ్యాణ్ చేయరు అనేది వారు సూత్రీకరణ. అందుకే పవన్ దుబ్బాక వెళ్లలేదని అలాగే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల ఆంధ్ర ఓటుబ్యాంక్ మరియు యువత ఓటుబ్యాంకు ఏదైతే బిజెపికి వెళ్తుందని భావిస్తున్నారో దాన్ని పవన్ కళ్యాణ్ చీలుస్తారని తద్వారా పరోక్షంగా లాభపడేది తెరాసానే. అందుకే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి టిఆర్ఎస్ కి మేలు జరిగేటిగా చూస్తాడు అనేది విమర్శకుల విశ్లేషణ.
పవన్ కళ్యాణ్ అంతగా కెసిఆర్ గానీ ఆయన కుటుంబానికి గానీ భయపడాల్సిన అవసరం ఏముందో వారు చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ కి హైదరాబాదులో పెద్దగా ఆస్తులు వ్యాపారాలు కానీ ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ షూటింగ్ హైదరాబాద్ లో కాకుండా మరెక్కడైనా పెట్టుకోమన్నా నిర్మాతలు పెట్టుకునే దానికి సిద్ధంగా ఉంటారు. మహా అంటే పవన్ కళ్యాణ్ సినిమా బెనిఫిట్ షోలు మాత్రం ఆపగలరు గాని సినిమా విడుదల కాకుండా ఏమీ ఆపలేరు కదా. ఆ భాదేదో నిర్మాతలు పడతారు కానీ పవన్ కళ్యాణ్ కు వచ్చే నష్టమేముంటుంది? కాబట్టి ఇంకో వారం రోజులు గడిస్తే గానీ పవన్ ఒంటరిగా పోటీ చేస్తారా బీజేపీతో కలిసి పోటీ చేసి టిఆర్ఎస్ ని ఓడించే ప్రయత్నం చేస్తారా అనేది స్పష్టత రాదు. అప్పటివరకు వేచి చూడటమే.