టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వైకాపా నేతలకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టులను షేర్ చేసినందుకుగాను, ప్రభుత్వాన్ని కించపరిచలా వ్యవరిస్తున్నారు అన్న ఆరోపణతోనూ సీఐడీ అధికారులు కిషోర్ ని కస్టడీకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గంటా హుటా హుటిన సీఐడీ కార్యాలయానికి చేరుకుని అధికారులపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అయితే నిన్న గంటా అనుచరులు విశాఖలో అంతకు మించి వేడి వాతావరణం సృష్టించినట్లు తెలుస్తోంది. కిషోర్ ని సీఐడి ఆఫీస్ కు తరలించిన నేపథ్యంలో గంటా అనుచరులు పరుచూరి భాస్కరరావు, మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, గంటా ఫాలోవర్స్ విశాఖ సీఐడీ కార్యాలయాన్ని రౌండప్ చేసారు.
కిషోర్ కార్యాలయం లోపలికి వెళ్లిన దగ్గర నుంచి కర్నూలు కు తరలించేంత వరకూ అక్కడ గంటా గ్యాంగ్ హడావుడి పీక్స్ లో చేసినట్లు స్థానికులు సైతం చెబుతున్నారు. కిషోర్ ని కలవడానికి లోపలకి వెళ్లడానికి ఎంత ప్రయత్నించినా ఒక్క లాయర్ ను తప్ప ఇంకెవరినీ పోలుసులు అనుమతించలేదు. అక్రమంగా వెళ్లడానికి విఫలయత్నం చేసారు. గంటాతో పాటు అతని అనుచరులు ఎవరెవరికో ఫోన్లు చేసి కాసేపు అక్కడ సినిమా వాతావరణాన్ని సృష్టించినట్లు, చివరకి ఎవరూ స్పందించకపో వడంతో అక్కడ నుంచి గంటా వెనుదిరిగారు. ఆ తర్వాత కొంత మంది గంటా అనుచరులు సీఐడీ కార్యాలయం చుట్టూ చక్కెర్లు కొట్టారు.
అలాగే మరికొంత మంది నలంద కిషోర్ ని కర్నూలుకు తరలించే వాహనాన్ని వెంబడించారు. ఆ తర్వాత కొంత మంది చివర్లో అన్నా భయపడొద్దు..మీ వెంట మెమంతా ఉన్నామని బిగ్గరగా అరిచి ఎవరి ఇళ్లకు వాళ్లు చేరుకున్నారు. దీంతో నిన్నటి వ్యవహారం పై వైకాపా సహా టీడీపీ లో పెద్ద చర్చ మొదలైంది. ఓ వైపు టీడీపీ సీనియర్ నేతల్ని అరెస్ట్ చేస్తున్నా గంటా పట్టించుకోలేదు. కానీ నలంద కిషోర్ ని అరెస్ట్ చేసే సరికి గంటా ఆగ మేఘాలుగా సీఐడీ కార్యాలయానికి చేరుకుని హడావుడి చేయడం పై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు.