మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు నలంద కిషోర్ విశాఖలో హఠాన్మరణం పొందారు. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో శనివారం ఉదయం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు వదిలినట్లు కుటుబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గంటా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తనకు ఎంతో కావాల్సిన వ్యక్తి అని, ఆయనతో ఎంతో మంచి అనుబంధం ఉందని కిషోర్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. ఇంకా పలువురు రాజకీయ నాయకులు, కిషోర్ సన్నిహితులు తదితరులు సంతాపం ప్రకటించారు. ఇటీవలే నలంద కిషోర్ ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో అదుపులోకి తీసుకుని స్థానిక కార్యాలయం నుంచి కర్నూలుకు తరలించారు.
అక్కడ సీఐడీ కార్యాలయంలో అధికారులు విచారించారు. అనంతరం ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఇంతలోనే నలంద కిషోర్ ఇలా మృతి చెందడంపై వైకాపా ఆరోపణలు చేస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి గుండెపోటు వచ్చి చనిపోవడం అంతా డ్రామా అంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన ఆరోపణల్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇటివలి కాలంలో టీడీపీ సీనియర్ నేతలు వరుసగా అవినీతి, అక్రమాల కేసులు అరెస్ట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు, అక్రమ రిజిస్ర్టేషన్లతో బస్సులు నడిపిన ట్రావెల్ కింగ్ జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డి జైళ్లలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు సహా పలువురి టీడీపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పు డు సైకిళ్ల కుంభకోణం జరిగిందని ఇటీవలే అధికార పక్షం నేతలు గంటాపై ఆరోపణలు చేసారు. గంటాపై ఆపరేషన్ మొదలు పెడితే చాలా అవినీతి కేసులుంటాయని తెరపైకి వచ్చింది. ఈనేపథ్యంలోనే అతని అనుచరుడు, బినామీగా ఉన్న నలంద కిషోర్ ని సీఐడీ అరెస్ట్ చేసి విచారించింది. ఇక రెండు రోజుల నుంచి గంటా వైకాపా గూటికి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చేరడానికి ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని మంచి ముహూర్తం చూసుకుని కండువా కప్పుకోవడమే ఆలస్యమని మీడియా కథనాలు వేడెక్కించాయి. కానీ ఇంతలోనే శనివారం నలంద కిషోర్ మృతి చెందడం హాట్ టాపిక్గా మారింది.