Gaddar Cine Awards 2014: తెలంగాణ రాష్ట్రం సినీ అభివృద్ధికి బాటలు వేయాలనే లక్ష్యంతో గద్దర్ సినీ పురస్కారాలు స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే తాజాగా 2014 నుంచి 2024 మధ్య కాలంలో విడుదలైన ఉత్తమ చిత్రాల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ గద్దర్ సినీ పురస్కారాల్లో ప్రతీ ఏడాది మూడు అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసారు. వాటికి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలలో అవార్డులు ప్రదానం చేసారు. ఈ క్రమంలో 2014 సంవత్సరానికి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా పాఠశాల సినిమా ఎంపిక అయ్యింది.
కాగా ఈ పాఠశాల మూవీ ఆ ఏడాది యువత విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా యువతకు ఒక జ్ఞాపకంగా నిలిచిపోయింది. మాహి వి. రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అసలు సినిమా అంటే కథ కాదు, ప్రయాణం అనే విషయాన్ని మరోసారి రుజువు చేసిందని చెప్పాలి. ఈ సినిమాలో ఐదుగురు స్నేహితులు జీవితంలో ఎటు పోతున్నామో స్పష్టంగా తెలియని దశలో అనుకోని రీతిలో ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఐదు వారాల పాటు దాదాపుగా 5000 కిలో మీటర్ల పయణిస్తారు. ఇది చాలా మంది హృదయాలను తాకింది.
కాగా ఈ సినిమా నెమ్మదిగా సాగేలా అనిపించవచ్చు కానీ ప్రతి సన్నివేశం, ప్రతి సంభాషణ భావోద్వేగాలను నేరుగా మన హృదయానికి కలిపేస్తుందని చెప్పాలి. కాగా రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం, విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇకపోతే ఈ సినిమాకు గద్దర్ సినీ అవార్డు దక్కడం పట్ల చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ గౌరవం మా పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభినందన, మా సినిమా సారాన్ని గుర్తించినదానికి నిదర్శనం. పాఠశాల మూవీను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇది చారిత్రాత్మక గుర్తింపుగా నిలుస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవార్డు మా ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది అని మూవీ మేకర్స్ తెలిపారు. అయితే సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా పాఠశాల సినిమా నిలవగా టాప్ వన్ లో రన్ రాజా రన్ సినిమా నిలిచింది.