కరోనాతో మాజీ కేంద్రమంత్రి దిలీప్‌ గాంధీ కన్నుమూత !

కరోనా వైరస్ పాజిటివ్‌కి గురైన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత దిలీప్ గాంధీ మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బుధవారం ఉదయం కన్ను మూశారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. అహ్మద్ నగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన దిలీప్ గాంధీ.. లోగడ షిప్పింగ్ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. కాగా ఆయన మరణానికి కరోనా వైరసే కారణమా అన్నది నిర్ధారణ కాలేదని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి.

బహుశా ఇతర రుగ్మతల కారణంగా కూడా ఆయన మరణించి ఉండవచ్చునని ఇవి పేర్కొన్నాయి. 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దిలీప్ గాంధీ 2 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. 1951, మే 9న మహారాష్ట్రలో జన్మించారు. బీజేపీ జిల్లా సంస్థలో ప్రధాన కార్యదర్శి, జాయింట్ సెక్రెటరీ, ప్రెసిడెంట్ పదవులు నిర్వహించారు. అహ్మద్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1985లో అహ్మద్‌నగర్ మున్సిపల్‌ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడిగా నియామకమయ్యారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2003, జనవరి 29 నుంచి 2004, మార్చి 15 వరకు విదేశాంగ శాఖ, షిప్పింగ్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతికి కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ ప్రభు సంతాపం ప్రకటించారు.