తెలంగాణ గడ్డపై షర్మిల తొలి అడుగు అదిరిందిగానీ.!

First Step In Telangana, Ys Sharmila's Sensational Speech

First Step In Telangana, Ys Sharmila's Sensational Speech

వైఎస్ షర్మిల, తెలంగాణలో పెట్టబోయే రాజకీయ పార్టీకి సంబంధించి తొలి అడుగు నిన్న ఖమ్మం గడ్డ మీద పడింది. ఈ క్రమంలో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలనే లక్ష్యంగా చేసుకుని తాను బాణాన్నై దూసుకొస్తున్నట్లు షర్మిల చెప్పారు. త్వరలో నిరుద్యోగుల కోసం మూడు రోజుల నిరాహార దీక్ష హైద్రాబాద్లో నిర్వహించి, ఆ తర్వాత రిలే నిరాహార దీక్షలు తమ పార్టీ నేతలతో చేయిస్తానని షర్మిల ప్రకటించారు. దేశంలో సచివాలయానికి వెళ్ళని ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని షర్మిల విమర్శించారు. నీళ్ళు, నిథులు, నియామకాలన్నీ కల్వకుంట్ల కుటుంబానికే తప్ప, తెలంగాణ ప్రజలకు కాకుండా పోయాయన్నారు షర్మిల. ఆద్యంతం మాటల తూటాలతో సాగింది షర్మిల ప్రసంగం. అంతకుముందు వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి, తన బిడ్డను తెలంగాణ ప్రజానీకానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, జులై 8న వైఎస్సార్ జయంతి సందర్బంగా కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండాని ప్రకటిస్తానని అన్నారు షర్మిల.

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలోకి వస్తామనీ, రాజన్న రాజ్యమే లక్ష్యంగా తమ పాలన వుంటుందని షర్మిల చెప్పుకొచ్చారు. తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేననీ, బరాబర్ తెలంగాణలో సత్తా చాటతామనీ షర్మిల వ్యాఖ్యానించడం గమనార్హం. ఖమ్మం.. ఉద్యమాల గుమ్మం.. అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించడం మరో విశేషం. ‘మీలోనే చాలామంది నాయకులున్నారు.. నేటి కార్యకర్తలే, రేపటి నాయకులు..’ అంటూ బహిరంగ సభకు వచ్చిన వైఎస్సార్ అభిమానుల్ని ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించడం మరో ఆసక్తికర అంశం. కరోనా నిబంధనలున్నా, భారీ జనసందోహం షర్మిల ఖమ్మం సభలో కన్పించింది. ఖమ్మం సభలోనే పార్టీ పేరు, జెండా ఖరారు చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, జులై 8వ తేదీ వరకు ఆ వ్యవహారాన్ని షర్మిల అండ్ టీమ్ వాయిదా వేయడం గమనార్హం.