Minister Roja : రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించినప్పుడు అప్పటి టీడీపీ నేతగా రోజా, చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యల్ని ఎలా మర్చిపోగలం.? అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని చిరంజీవి మీద రోజా రాజకీయంగా చేశారు.
ఇప్పుడు అదే రోజా, తనకు మంత్రి పదవి వచ్చాక.. తనంతట తానుగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్ళారు.. చిరంజీవిని కలిశారు.. చిరంజీవిని కలవడం ఆనందంగా వుందన్నారు.. చిరంజీవికి థ్యాంక్స్ కూడా చెప్పారు. దీని భావమేమి తిరుమలేశా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
సినీ పరిశ్రమ సమస్యల నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు, ఆ సమయంలో చిరంజీవి.. ముఖ్యమంత్రిని చేతులు జోడించి వేడుకోవాల్సి వచ్చింది. ఆ వ్యవహారంపై చాలామంది ఇప్పటికీ గుర్రుగా వున్నారనుకోండి.. అది వేరే విషయం.
సినీ పరిశ్రమకే చెందిన రోజా, అప్పటికి ఎమ్మెల్యేగా వున్నారు.. అదీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు. కానీ, ఆమె సినీ పరిశ్రమ సమస్యల్ని తమ అధినేత దృష్టికి తీసుకెళ్ళలేకపోయారు.
అన్నట్టు, రోజా.. చిరంజీవితోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌ని కలిసి ‘తండ్రి సమానులైన కేసీయార్ ఆశీస్సులు తీసుకున్నాను..’ అని చెప్పడం కొసమెరుపు. ఆమె ఈమేనా.? ఫైర్ బ్రాండ్ రోజా ఇలా మారిపోయారేంటి.? అని అంతా చర్చించుకుంటున్నారు.