ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చాన్నాళ్ళ తర్వాత దర్శనమిచ్చారు జనానికి. హైద్రాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి కాస్సేపటి క్రితం చేరుకున్నారు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయల్దేరారు.
జనసేన అధినేతకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కరోనా బారిన పడి కొన్నాళ్ళపాటు పవన్ కళ్యాణ్, బయటకు రాలేదు. కరోనా నుంచి కోలుకోవడానికి కూడా ఆయనకు ఎక్కువ సమయమే పట్టింది. దాంతో తమ అభిమాన నటుడు, నాయకుడు ఎలా వున్నాడోనని అభిమానులు ఆందోళన చెందారు. జనసైనికుల ఆందోళన సరే సరి.
కొద్ది రోజుల క్రితమే తనయుడు అకిరాతో కలిసి ఓ ఫొటోలో కనిపించారు పవన్. ఆ తర్వాత పవన్, తన తాజా చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సినిమా విషయాల్ని పక్కన పెడితే, జనసేనాని.. తిరిగి జనంలోకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన జనసైనికులు, జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ నివాళులర్పించనున్నారు పార్టీ కార్యాలయంలో.
అనంతరం, పార్టీకి సంబంధించి కీలకమైన సూచనల్ని పార్టీ ముఖ్య నేతలుకు తెలియజేయనున్నారు జనసేనాని. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదాలు వంటి అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని చర్చిస్తారు.
అంతా బాగానే వుందిగానీ.. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయాల్ని పవన్ బ్యాలెన్స్ చేయడమెలా కుదురుతుంది.? చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి పవన్ కళ్యాణ్ చేస్తున్నవి, చేయాల్సినవి. అమరావతి టు హైద్రాబాద్ షటిల్ సర్వీస్ చేసేత తప్ప.. రెండిటినీ సమన్వయం చేయడం కష్టమే మరి.