రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. ఇంతకుముందులా సినీ తారలను చూసి ఓట్లు రాలే పరిస్థితి పోయింది. ఎంత రాజకీయ శూన్యత ఉన్నా సినీ హీరోల పార్టీలు అంటే జనం లైట్ తీసుకుంటున్నారు. అధికారం చేజిక్కించుకునే సంగతి దేవుడెరుగు కనీసం పార్టీ పెట్టిన లీడర్లు కూడ ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు. అందుకు బెస్ట్ ఉదాహరణ పవన్ కళ్యాణ్. పాతుకుపోయిన రాజకీయాలు పార్టీలను, వారి కుటుంబాలను ఢీకొట్టడం ఎంత కష్టమో పవన్ తిప్పలు చూస్తే తెలుస్తుంది. అడుగడుగునా భంగపాటే తప్ప విజయాలు లేవు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సంగతిని తన రాజకీయ రంగప్రవేశం ఆఖరి దశలో గుర్తెరిగారు.
అందుకే అభిమానులు నొచ్చుకున్నా సరే రాజకీయాల్లోకి రావట్లేదని తేల్చి చెప్పేశారు. ఆయన నిర్ణయంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. రజినీ మీద విమర్శలు గుప్పించారు. రజినీ పొరపాటు నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. కానీ నిన్న వెలువడిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూస్తే రజినీ వేసిన అడుగే కరెక్ట్ అని ప్రూవ్ అయింది. ఎన్నికలు డీఎంకే వెర్సెస్ అన్నాడీఎంకే అన్నట్టే జరిగాయి తప్ప ఎక్కడా మూడవ పార్టీకి ఆస్కారం దక్కలేదు.
కమల్ హాసన్ సైతం ఓడిపోగా ఆయన పార్టీ ఒక్క చోట కూడ గెలవలేదు. ఒకవేళ రజినీ గనుక ఈ ఎన్నికల్లో పోటీచేసి ఉంటే కమల్ తరహాలోనే దారుణ పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చేది. ఓటమి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ వయసులో రజినీ వాటిని తట్టుకోగలరని కూడ అనుకోలేం. ఈ పరిస్థితిని ఊహించే రజినీ వెనకడుగు వేసి మంచి పని చేశారు. అభిమానులు సైతం ఓడిపోయి పరువు కోల్పోవడం కంటే తప్పుకోవడమే ఉత్తమంగా ఉందని, రజనీ నిర్ణయమే కరెక్ట్ అని ఫీలవుతున్నారు.