త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలు ఎలాంటి గోల లేకుండా తమ తమ అభ్యర్థులను ఫైనల్ చేసుకున్నాయి. వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, తెలుగుదేశం తరపున పనబాక లక్ష్మి బరీలోకి దిగనుండగా అసలు ఉన్నాయో లేవో కూడ తెలియని జనసేన, బీజేపీలు సీటు కోసం తన్నుకుంటున్నాయి. పొత్తుల్లో భాగంగా సీటు ఎవరికి వెళ్లాలనేది పెద్ద చర్చగా మారింది. తిరుపతిలో తమకు తిరుగులేని కేడర్ ఉందని బీజేపీ అంటోంది. 1999లో ఆ సీటును గెలిచామని, ఈసారి కూడ గెలుస్తామని చెబుతోంది. మరోవైపు జనసేన సైతం అదే మాట చెబుతోంది. ఇక్క సామాజిక సమీకరణాల దృష్ట్యా పవన్ కుటుంబానికి ఎక్కువ ఆదరణ ఉంటుందని, ఇక్కడ చిరు ఎమ్మెల్యేగా గెలిచారని చెబుతున్నారు.
ఒకప్పటి చరిత్ర చూసుకుని టికెట్ మాకు కావాలంటే మాకు కావాలని పోట్లాడుకుంటున్న ఇరు పార్టీలు గత ఎన్నికల్లో పొందిన ఓట్లు చూస్తే ఆ పార్టీల పరిస్థితి ఏమిటనేది తేలిపోతుంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే సాధించగా జనసేన మద్దతిచ్చిన బిఎస్పీయే క్యాండిడేట్ 21 వేల ఓట్లకే పరిమితమయ్యారు. మరోవైపు నోటాకు 25 వేల పైచిలుకు ఓట్లు పడటం గమనార్హం. పైగా ఈ ఇరు పార్టీల కంటే కనుమరుగైందనుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 24 వేల ఓట్లు పడ్డాయి. దీన్నిబట్టి బీజేపీ, జనసేనల బలమేంటో తేటతెల్లమైంది. ఇక 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినా తిరుపతి లోక్ సభలో బీజేపీ, టీడీపీల ఉమ్మడి అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఆ టైంలో పొత్తుల్లోకి వెళ్లకుండా ఉండి ఉంటే ఆ స్థానాన్ని గెలిచి ఉండేవారమని తెలుగుదేశం అన్న సందర్భాలు కూడ ఉన్నాయి.
అలాంటి వరస్ట్ ట్రాక్ రికార్డ్ పెట్టుకుని ఉపఎన్నికల్లో తిరుపతిలో దున్నిపారేస్తామని బీజేపీ బీకాలు పలుకుతుండటం, సీటు తమకిస్తే గెలిపించుకుని తీరుతామని జనసేన అనడం చూస్తుంటే విస్మయం కలుగక మానదు. ప్రస్తుతానికి అభ్యర్థి విషయంలో నెలకొన్న సందిద్గత అయితే ఇంకా తీరలేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మరీ చర్చలు జరుపుకుని వచ్చారు. బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు మాత్రం తమ అభ్యర్థే కన్ఫర్మ్ అని బల్లగుద్దుతున్నారు. వీరి లెక్కలు, వాదోపవాదాలు చూస్తే ఉపఎన్నికను గెలిచేస్తారేమో అన్నంత పకడ్బందీగా ఉన్నాయి. అసలు ఎన్నికల్లో గెలవడం మాట అటుంచితే ముందు ఈ టికెట్ కొట్లాటలో ఏ పార్టీ గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఓటర్లు సైతం ఎన్నికల్లో బీజేపీ, జనసేనల్లో ఎవరు నిలబడినా గెలుపు గురించి మాట్లాడుకోనక్కర్లేదు కానీ టికెట్ ఎవరు దక్కించుకుంటారనేది మాత్రం చూడాలని అంటున్నారు.