కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్న వారిలో హీరో సూర్య ఒకరు. ఈయనకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సూర్య నటించిన సినిమాలు తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ సంపాదించుకొని భారీ కలెక్షన్లను రాబట్టాయి. ఇక తెరపై సూర్య కనిపించారు అంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. అయితే కరోనా సమయం నుంచి సూర్య నటించిన సినిమాలన్నీ కూడా థియేటర్ లో కాకుండా డిజిటల్ మీడియాలో విడుదలవుతున్నాయి.
ఈ క్రమంలోనే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య క్లైమాక్స్ సన్నివేశంలో సందడి చేశారు.ఈ విధంగా చాలా రోజుల తర్వాత సూర్యను ఇలా స్క్రీన్ పై చూసేసరికి అభిమానులు అత్యుత్సాహం కనబరిచారు. అగ్ర హీరో కమల్ హాసన్ సినిమాలో సూర్య ఇలా స్క్రీన్ పై కనిపించే సరికి పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేయడమే కాకుండా అత్యుత్సాహంతో థియేటర్లో ఏకంగా టపాకాయలు పేల్చారు. ఈ విధంగా టపాకాయలు కాల్చడంతో ఒక్కసారిగా మంటలు స్క్రీన్ పై పడి స్క్రీన్ మొత్తం కాలిపోయింది.ఇలా ఒక వైపు మంటలు వ్యాప్తిచెందుతుండగానే మరోవైపు సినిమా కూడా రన్ అవుతోంది.
ఒక్కసారిగా థియేటర్ లో పెద్ద ఎత్తున మంటలు ఏర్పడటంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పుదుచ్చేరిలోనీ ఒక థియేటర్లో చోటుచేసుకుంది. కేవలం తమ అభిమాన నటుడు సూర్య పై ఉన్న అభిమానంతో అభిమానులు అత్యుత్సాహం చూపడం వల్ల ఏకంగా థియేటర్ మొత్తం మంటలు వ్యాప్తి చెందుతూ లక్షల్లో నష్టం వాటిల్లిందని చెప్పాలి.