Fake Tweet : ఉద్యోగుల గుస్సా: వైసీపీ కొంప ముంచుతున్న ఫేక్ ట్వీట్.?

Fake Tweet : ఏపీ ఉద్యోగులపై వైసీపీ నేత ఒకరు వివాదాస్పదమైన రీతిలో ట్వీటేశారంటూ సోషల్ మీడియాలో కలకలం రేగింది. వైసీపీలో అయితే, ఈ ట్వీటు పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. ఉద్యోగులు ఈ ట్వీటు పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారట.

వైసీపీ నేత గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పేరుతో ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అది ఫేక్ ట్వీటా.? నిజమైన ట్వీటేనా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. కానీ, ఓ స్క్రీన్ షాట్ మాత్రం దేవేందర్ రెడ్డి పేరు మీదనే సర్క్యులేట్ అవుతోంది.

ఉద్యోగులు బలిసి కొట్టుకుంటున్నారనీ, పీఆర్సీ లేదు, హెచ్ఆర్ఎ లేదు.. ఇంతకన్నా తక్కువ జీతానికి పనిచేసేవారున్నారు.. అందర్నీ తీసి పారెయ్యండని ఉద్యోగులపై దేవేందర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ ట్వీటుంది. అది ఆయన పేరుతోనే చెలామణీలోకి వచ్చింది స్క్రీన్ షాట్ రూపంలో.

ఈ ట్వీటు విషయమై వైసీపీ అధికారికంగా స్పందించాల్సి వుంది. ఇంత రచ్చ జరుగుతున్నా దేవేందర్ రెడ్డి సైతం స్పందించకపోవడం గమనార్హం. అయితే, దేవేందర్ రెడ్డి టైమ్ లైన్‌లో మాత్రం ఈ ట్వీటు కనిపించడంలేదు. ఆ ట్వీటుని ఆయన తొలగించారా.? లేదంటే, మాయాజాలం చేసి ఫేక్ ట్వీటుని ఆయనంటే గిట్టనివారు ప్రచారంలోకి తెచ్చారా.? అన్నది తేలాలి.

గతంలో సినీ పరిశ్రమకు చెందినవారిపై ‘బలిసి కొట్టుకుంటున్నారు..’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఆ వ్యవమారంపై పెద్దయెత్తున దుమారం చెలరేగింది కూడా. మరిప్పుడు, దేవేందర్ రెడ్డిదిగా చెప్పబడుతున్న ట్వీటు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.