Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి.? అన్నది వేరే చర్చ. చాలా సందర్భాల్లో ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలే నిజమవుతున్నాయి గనుక, ఇలా పోలింగ్ పూర్తవగానే, అలా ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చేయడం, వాటి పట్ల విపరీతమైన క్రేజ్ మీడియా వర్గాల్లో నెలకొనడం సర్వసాధారణమే అయిపోయింది. తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకొచ్చాయి.
ప్రధానంగా పశ్చమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతాయన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. బీజేపీకి ఎదురొడ్డి నిలబడ్డ పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్నికల ప్రచారంలో గాయపడిన విషయం విదితమే. ఆ కారణంగా ఆమె అనుకున్న స్థాయిలో తన పార్టీ టీఎంసీ తరఫున ప్రచారం చేయలేకపోయారు. ఆ ఎఫెక్ట్ బాగానే పడినట్లుంది. దాంతోపాటుగా, సుదీర్ఘ కాలం ఆమె పశ్చమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ప్రభుత్వ వ్యతిరేకత కూడా గట్టిగానే వున్నట్లుంది. స్వయంగా మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓడిపోతారంటూ కొన్ని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.
బీజేపీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార పీఠమెక్కబోతోందన్నది మెజార్టీ ఎగ్జిట్ పోల్ అంచనాల సారాంశం. అయితే, అతి తక్కువ పోల్స్ మాత్రం మమతా బెనర్జీ తిరిగి అధికారం దక్కించుకోవచ్చని చెబుతున్నాయి. ఇంతకీ, పశ్చిమబెంగాల్ ఓటర్లు ఎలాంటి తీర్పునిచ్చారు.? హింస, రిగ్గింగ్.. ఇలా చాలా వ్యవహారాలు కారణంగా దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్ అంచనాల నేపథ్యంలో బీజేపీ అప్పుడే సంబరాలు షురూ చేసింది. టీఎంసీ శ్రేణుల్లో అప్పుడే నైరాశ్యం కనిపిస్తోంది.