చిరంజీవి సాయం కోరుతున్న ఆ మాజీ మంత్రి ఎవరు.?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో లేరు. కానీ, ఆయన చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సినిమాల్లో బిజీగా వున్నా, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తే బావుంటుందన్న ఆలోచన కొందరిలో వుంది. కానీ, రాజకీయాలకు దూరంగా వుండటమే మంచిదంటూ చిరంజీవికి సూచనలు చేసేవారూ లేకపోలేదు.

తాజాగా ఓ మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారట. రాజకీయంగా తాను ఏ వైపు నడవాలి.? అన్నదానిపై చిరంజీవి సాయం కోరారట సదరు మాజీ మంత్రి. ఎవరా మాజీ మంత్రి.? ఏమా కథ.? ఏ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆయన.? తాజా మాజీ మంత్రి అనుకోవాలా.? ఇంకేమైనా అనుకోవాలా.?

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సదరు మాజీ మంత్రి బీజేపీలోకి లేదా జనసేనలోకి వెళ్ళాలనే ఆలోచనతో వున్నట్లు కనిపిస్తోంది. ‘ఏ పార్టీలోకి వెళితే మంచిది.?’ అన్న విషయమై చిరంజీవిని సలహా అడిగారట సదరు మాజీ మంత్రి. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, సదరు మాజీ మంత్రికి చిరంజీవితో గతంలో రాజకీయంగా సన్నిహిత సంబంధాలుండేవి.

అయితే, రాజకీయంగా చిరంజీవి సోదరుడ్ని విమర్శించడంలో అత్యుత్సాహం చూపారు ఆ మాజీ మంత్రి. అప్పట్లో అలా తప్పలేదనీ, ఇప్పుడు తప్పు తెలిసొచ్చిందనీ, అందుకే నేరుగా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాననీ సదరు మాజీ మంత్రి చిరంజీవి వద్ద వాపోయారట.

కాగా, తాను రాజకీయాల నుంచి దూరంగా వున్నాననీ, రాజకీయంగా ఎలాంటి సలహాలూ ఇవ్వలేనని సదరు మాజీ మంత్రికి చిరంజీవి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.