జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణల వివాదంలో రోజు రోజుకూ కొత్త వివాదాలు వెలుగు చూస్తున్నాయి. ఈశ్వరయ్యకు, మాజీ జడ్జి రామకృష్ణకు మధ్యన జరిగిన సంభాషణలో ఈశ్వరయ్య అనేక విషయాల మీద మాట్లాడారు. ముఖ్యంగా మరొక జడ్జి నాగార్జునరెడ్డి మీద తీవ్ర స్థాయిలో మాట్లాడారు. తాను రామకృష్ణతో మాట్లాడిన మాట వాస్తవమేనని, కానీ పరుషంగా మాట్లాడలేదని, కేవలం అణగారిన వర్గాలకు న్యాయ వ్యవస్థలో సముచిత స్థానం ఉండాలనే ఉద్దేశ్యంతో మట్లాడానని మీడియా సమావేశంలో అన్నారు. కానీ ఈ వివాదం అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ గొడవలా మారిపోయింది. ఇది ఈశ్వరయ్యను అడ్డంపెట్టుకుని కోర్టుల మీద జగన్ చేస్తున్న దాడి అని టీడీపీ అంటే ఈశ్వరయ్య మాటలను ప్రభుత్వానికి అన్వయించడం కుట్రని వైసీపీ వర్గం అంటోంది.
ఇక కోర్టులో సంభాషణలు విడుదల చేసిన రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మరొక సంచలన విషయాన్ని బయటకు తీశారు. ఆనాడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దుశ్రీనును అనంతపురం జైల్లో సహచర ఖైదీ ఓంప్రకాష్ లైట్ ఆఫ్ చేశాడనే చిన్న కారణంతో డంబెల్స్ తీసుకుని కొట్టి చంపాడని అతనికి జీవిత ఖైదు విధించారు. ఈమధ్యే ఓంప్రకాష అనారోగ్యంతో జైల్లోనే మరణించాడు. ఈ విషయాన్నే ప్రస్తావించిన రామకృష్ణ ఆ కేసును ఈశ్వరయ్య ప్రభావితం చేశారనే అనుమానం కలుగుతోందని అంటూ సంచలనం రేపారు.
అసలు మొద్దుశ్రీనును బయటే చంపేసి ఈడ్చుకొచ్చి ఓంప్రకాష ఉన్న బ్యారక్లో పడేశారని, ఈడ్చుకొచ్చిన రక్తపు మరకలను ఆనాడు మెజీస్టెట్ గా ఉన్న తాను కళ్లారా చూశానని అన్నారు. విచారణలో కూడా ఓంప్రకాష్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని నిందితుడు కోర్టులో తన ముందు విలపించాడని, తాను రిపోర్టు ఇచ్చిన తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య అనంతపురం వచ్చి బీసీ కమ్యూనిటీకి చెందిన మరొక జిల్లా జడ్జిని కలిశారని, వారి నడుమ అపవిత్ర సంభాషణ జరిగి ఉంటుందని, ఆనాడు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందనే అనుమానం తనకు ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.