మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య బాగా సోషల్ అయిపోయారు. మామూలుగా ఆయనలాంటి స్టార్ హీరోను కలవడమే కష్టం. అలాంటిది సినిమా వేడుకలకు అయన్ను తీసుకొచ్చుకోవడం అంటే ఇంకా కష్టం. కానీ చిరు అలాంటి కష్టం కలిగించట్లేదు. అందరికీ అందుబాటులో ఉంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన వద్దకు వచ్చిన ప్రతి సినిమాకు మద్దతిస్తున్నారు.
టీజర్, ట్రైలర్ లాంచ్ చేయడమో లేకపోతే ప్రీరిలీజ్ వేడుకకు హాజరుకావడమో చేస్తున్నారు. ఇక పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు సైతం చిరు చెయ్యి పడితే బోలెడంత ప్రమోషన్ అని భావించి ఏదో రకంగా ఆయన్ను అప్రోచ్ అవుతున్నారు.
ఈ ఏడాదిలో పలు సినిమాల టీజర్, ట్రైలర్లను తన చేతుల్తో రిలీజ్ చేసిన ఆయన ఈమధ్య ‘శ్రీకారం’ ప్రీరిలీజ్ వేడుకకు కూడ హాజరయ్యారు. ఇక తాజాగా రానా, సాయి పల్లవి కలిసి నటించిన ‘విరాటపర్వం’ టీజర్ ను కూడ చిరుయే లాంచ్ చేయనున్నారు. రేపు గురువారం సాయంత్రం 5: 04 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నారు. చిరు చేతుల మీదుగా రిలీజ్ అనగానే టీజర్ పట్ల ప్రేక్షకుల్లో కూడ క్రేజ్ పెరిగింది. అయినా షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ చిరు ఇతర సినిమాల కోసం ఇలా టైమ్ కేటాయించడమనేది అభినందించదగిన విషయమే. ఇకపోతే ఇప్పటికే ‘ఆచార్య’ చిత్రీకరణను దాదాపు ముగించేసిన చిరు వచ్చే నెలలో ‘లూసిఫర్’ రీమేక్ మొదలుపెట్టనున్నారు.