రేపే ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా.? తర్వాతేంటి.?

Etela To Resign For MLA Post, What Next?

Etela To Resign For MLA Post, What Next?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రేపే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారట. త్వరలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరనున్న విషయం విదితమే. ఈటెల, బీజేపీలో చేరనున్న విషయాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్ననే ప్రకటించేశారు కూడా. అయితే, ఈటెలకు బీజేపీలో ఎలాంటి పదవులు దక్కనున్నాయి, ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కనుంది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

ఇదిలా వుంటే, ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, అది తెలంగాణ రాష్ట్ర సమితిలో పెద్ద కుదుపుకు దారితీస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు తప్ప, నైతిక విలువల పాటించి రాజీనామాలు చేయడం అనేది జరగడంలేదు. ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి నిస్సిగ్గుగా నేతలు దూకేస్తున్నారు. ఇలాంటి తరుణంలో, ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరితే, తద్వారా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన నేతలు తమ తమ నియోజకవర్గాల్లో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వుండదు.

ఈ కోణంలోనే, ఈటెలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయిస్తోంది బీజేపీ. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాల్ని తక్కువగా అంచనా వేయలేం. ఈటెల రాజీనామా చేసిన మరుక్షణం ఆయన రాజీనామాకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. తక్షణం తెలంగాణ సెంటిమెంటుని రగిల్చి, ఈటెల వ్యవహారాన్ని డైల్యూట్ చేయడానికి కేసీఆర్ పక్కగా వ్యూహాలు సిద్ధం చేశారట. అవినీతిపరుడు కాబట్టే, ఈటెలను మంత్రి పదవి నుంచి తొలగించామని తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా చెప్పుకోగలుగుతోంది. అయితే, ఈటెల మాత్రం అనుకున్న స్థాయిలో తన ఇమేజ్ పెంచుకోలేకపోయారు మంత్రి పదవి పోయాక.