తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ‘చేస్తాను, చెయ్యాల్సిందే.. అయితే, నన్ను గెలిపిస్తూ వస్తోన్న నియోజకవర్గ ప్రజలు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటాను..’ అని ఈటెల రాజేందర్ చెప్పి గంటలు, రోజులు గడుస్తున్నాయి. తొలుత ఈటెల రాజేందర్ దగ్గర్నుంచి వైద్య ఆరోగ్య శాఖను తొలగించి, ఆ తర్వాత మంత్రి వర్గం నుంచి ఈటెలను బయటకు గెంటేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోవడంతో, ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కూడా అంతే వేగంగా జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఎప్పుడైతే ఈటెల కుటుంబానికి చెందిన జమున హేచరీస్, న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంత ఊరట పొందిందో, ఆ తర్వాత ఈటెల మాటల్లో స్పష్టమైన మార్పు షురూ అయ్యింది.
ఈటెల, తన కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కోసం భూ కబ్జాలకు పాల్పడ్డారన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. అయితే, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చిన్నపాటి ఝలక్ తగిలింది. ఇప్పుడిక ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, తాను నిజాయితీపరుడినని నిరూపించుకోవడానికి ఈటెలకు కాస్త సమయం దొరుకుతోంది మరి. న్యాయపోరాటం షురూ అయ్యాక, మధ్యలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, నేరాన్ని ఒప్పేసుకున్నట్లే అవుతుంది నైతికంగా. అందుకే ఈటెల రాజీనామా విషయంలో కాస్త ఆచి తూచి అడుగులేస్తున్నారట. ఒకవేళ కోర్టులో గనుక ఈటెలకు క్లీన్ చిట్ దక్కితే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి అది చాలా పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. అందుకే, ఒక్క విషయంలో కాదు, నాలుగైదు కేసుల్లో ఈటెలను ఇరికించే దిశగా అధికార పార్టీ పావులు కదుపుతోంది.