తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా వినిపించిన మాట ‘తెలంగాణ ఆత్మగౌరవం’. మళ్ళీ ఇప్పుడు అదే సెంటిమెంటు అస్త్రాన్ని కొత్తగా తాను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఆత్మగౌరవ పోరాటమిది.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీపై పోరాటానికి సిద్ధమవుతున్న ఈటెల రాజేందర్ చెబుతున్నారు. అయితే, ఈటెల తెరపైకి తెస్తున్న ఈ ఆత్మగౌరవ నినాదం పెద్దగా ఎవరినీ కదిలించడంలేదు.
ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతోపాటు బీజేపీకి చెందిన నేతలతోనూ రాజకీయపరమైన చర్చలు జరిపారు. అక్కడే ఆత్మగౌరవం లేదు.. అరటిపండూ లేదు.. అన్న విమర్శ ఈటెల మీద గట్టిగా వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్, బీజేపీల మీద ఈటెల చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. గులాబీ పార్టీ నేతలంతా ఈ రెండు పార్టీలపై దుమ్మెత్తిపోశారు.. ఈటెల కూడా అప్పడు గులాబీ నేత గనుక, తనవంతు అత్యుత్సాహం ప్రదర్శించారు. అవసరానికి తగ్గట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగులు మార్చితే అది వర్కవుట్ అయ్యింది.. ఆయన తీరు వేరు.
ఈటెల రాజేందర్ పరిస్థితి వేరు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే, అక్కడి నుంచి గెలిచి ఈటెల తన స్థానాన్ని, తన స్థాయిని నిలబెట్టుకోవడానికే చాలా కష్టపడాలి. నిజానికి, బీజేపీ మీద ఈటెల చాలా ఆశలు పెట్టుకున్నారుగానీ, ‘వస్తే రావొచ్చు.. అంతకు మించి ప్రత్యేకమైన సీన్ ఆయనకి ఏమీ వుండదు..’ లని తెలంగాణ బీజేపీ నేతలే తేల్చేశారు. ఇంకెక్కడి ఆత్మగౌరవం.? ఈటెల సొంత పార్టీ పెట్టి వుంటే.. ఆయన చెబుతున్న ఆత్మ గౌరవ నినాదానికి కాస్తో కూస్తో అర్థం వుండేదేమో.