మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాస్సేపట్లో ఆంధ్రపదేశ్ పోలీసుల నుంచి నోటీసులు అందుకోనున్నారు. వారం రోజుల్లోగా ఆయన ఆ నోటీసులకు సమాధానం చెప్పాల్సి వుంటుందట. చెప్పకపోతే ఏం చేయాలన్నదానిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి ఫకీరప్ప (కర్నూలు ఎస్పీ) చెబుతున్నారు. కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ కర్నూలులో పుట్టిందంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నది చంద్రబాబుపై మోపబడ్డ అభియోగం. ఈ మేరకు ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీటిల్లో జాతీయ విపత్తుల నివారణ చట్టానికి సంబంధించిన సెక్షన్లూ వున్నాయి.
కరోనా నేపథ్యంలో అసత్య ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలంటూ కేంద్రం గతంలో ఆదేశాలు జారీ చేసి విషయం విదితమే. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఆదేశాలు అప్పట్లో జారీ అయ్యాయి. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఎక్కడికక్కడ లాక్ డౌన్ అమలవుతోంది. ఏపీలోనూ 18 గంటల కర్ఫ్యూ నడుస్తోంది. ఇదిలా వుంటే, సుప్రీంకోర్టు.. తప్పుడు సమాచారం పేరుతో.. ప్రజల మీద తీవ్రమైన చర్యలు తీసుకోకూడదనీ, వాటిని ప్రజల ఆందోళనగానే పరిగణించాలంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా వున్నా, చంద్రబాబు విచారణకు హాజరు కాక తప్పదన్న చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈసారి చంద్రబాబు తప్పించుకోలేరనీ, ఆయన్ని అరెస్ట్ చేయడం ఖాయమనీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు కుండబద్దలుగొట్టేస్తున్నారు. ఆ పరిస్థితి వుంటుందా.? ఇటీవల అమరావతి కుంభకోణమంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేస్తే, ఆ వ్యవహారంలో కోర్టు, చంద్రబాబుకి ఉపశమనాన్ని కలిగించింది.. ఏపీ సీఐడీ తీరునీ తప్పుపట్టింది. మరి, ఈసారేమవుతుందో వేచి చూడాలి.