Virat Kohli : విరాట్ కోహ్లీ కెరీర్ ముగిసినట్లే.. కారణమిదే.!

Virat Kohli : విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్‌కి సంబంధించి ఓ డైనమైట్. ఇంకెవరికీ సాధ్యం కాని ట్రాక్ రికార్డ్ బ్యాటింగ్ పరంగా విరాట్ కోహ్లీకి వుంది. ఛేదనలో అయితే, విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టీమిండియాకి కెప్టెన్‌గా సేవలందించిన, అందిస్తోన్న విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్ అతి త్వరలో ముగియబోతోందా.? అంటే, ఔననే చెప్పాలేమో.

టీ20 క్రికెట్ పోటీలకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ కొన్నాళ్ళ క్రితమే ప్రకటించాడు. అక్కడే వివాదం మొదలైంది. కోహ్లీకి బీసీసీఐ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ, కోహ్లీ వెనక్కి తగ్గలేదు. దాంతో, టీ20 పోటీల కోసం రోహిత్ శర్మని కెప్టెన్‌గా ఎంచుకుంది బీసీసీఐ.

ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ కోహ్లీని బీసీసఐ తొలగించింది. దాంతో కోహ్లీ హర్ట్ అయ్యాడు. టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడనే ప్రచారం జరిగింది. నిజానికి, విరాట్ కోహ్లీనే స్వయంగా లీకులు పంపుతూ వివాదానికి కారణమయ్యాడనే విమర్శ వుంది.

రోహిత్ శర్మని వన్డే కెప్టెన్‌గా నియమించే విషయమై విరాట్ కోహ్లీతో బీసీసీఐ చర్చించిందట. కానీ, అలా తనతో ఎవరూ చర్చించాలేదని కోహ్లీ తాజాగా మీడియా ముందుకొచ్చి చెప్పాడు. దాంతో వివాదం మరింత ముదిరి పాకాన పడింది.

వరుసగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాల్ని బట్టి చూస్తే, విరాట్ కోహ్లీ ఎక్కువ కాలం క్రికెట్ ఆడే పరిస్థితి వున్నట్టు కనిపించడంలేదు. పొమ్మనకుండా బీసీసీఐ పొగపెడుతోందా.? తనకు ఇష్టం లేకపోవడంతోనే విరాట్ కోహ్లీ టీమిండియాని బజార్న పడేశాడా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఏదిఏమైనా, ఇలాంటి వివాదాలతో విరాట్ కోహ్లీ నుంచి ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్‌ని ఆశించలేం.