కొద్దిరోజుల క్రితం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సన్నిహితుడికి చెందిన వాహనంలో రూ.5.27 కోట్ల నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఎలావూరులోని చెక్‌పోస్టు వద్ద చెన్నై పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఈ నగదు పట్టుబడింది. వాహనంలో ఉన్న ఒంగోలుకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. అసలు రాష్ట్రం దాటి ఇంత పెద్ద మొత్తం చెన్నై సరిహద్దుల వరకు ఎలా వెళ్లిందనే చర్చ మొదలైంది.
కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు పేరు మీద ఉండగా దొరికిన డబ్బు మంత్రి బాలినేనిదని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. వీటిలై స్పందించిన మంత్రి ఆ డబ్బుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇంతలో ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు తెరమీదకు వచ్చి డబ్బు నాదని ప్రకటించాడు. అతను కూడా బాలినేనికి సన్నిహితుడేనట. దీంతో ప్రతిపక్షం రచ్చ రచ్చ చేసింది. అందంతా అవినీతి సొమ్మేనని, అది జగన్ యొక్క జే ట్యాక్స్ సొమ్మని ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఈడీకి పిర్యాధు చేసింది.
ఇప్పటివరకు ఈ కేసును చెన్నై పోలీసులు, ఐటీ శాఖ హ్యండిల్ చేయగా తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. ఐటీ శాఖ నుండి కేసుకు సంబందించిన అన్ని వివరాలను సేకరించింది. అంత పెద్ద మొత్తంలో డబ్బు చెన్నైలో ఎవరి వద్దకు వెళుతోందో తెలుసుకోవాలని దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు. డబ్బు ఆంధ్రా పోలీసులు గనుక పట్టుకుని ఉంటే ఇంత సీన్ ఉండేది కాదని, ఎప్పుడో సెటిలైపోయేదని, తమిళనాడు పోలీసులకు చిక్కడంతో నిజమైన బాద్యులకు తిప్పలు తప్పవని అంటున్నారు.