బాబ్బాబు.. ఒక రూపాయి ధర్మం చేయి బాబు.. నీకు పుణ్యముంటది.. హే..పో.. ఈ అడుక్కునేవాళ్లకు పనీపాటా ఉండదు. ఎప్పుడూ అడుక్కుంటూనే ఉంటారు. ధర్మం చేయాలట ధర్మం.. అంటూ మనం రోజూ అడుక్కునే వాళ్లను చూసి అసహ్యించుకుంటూనే ఉంటాం. వాళ్లు దానం చేయమన్నది రూపాయి. మన దగ్గర ఉన్నా ఇవ్వడానికి మనకు మనసు ఒప్పదు. వామ్మో.. రూపాయి దానం చేయాలా? నాకేమైనా రూపాయి ఊరికే వచ్చిందా? అని అనుకుంటాం. నూటికి తొంబైతొమ్మిది మంది ఇలాగే ఆలోచిస్తారు. కానీ.. కొందరు మాత్రం తాము సంపాదించిన దాంట్లో కాస్తో కూస్తో దానం చేస్తుంటారు. కానీ.. ఈయన చూడండి.. ఆయన సంపాదించిన యావదాస్తిని దానం చేసేశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. ఉన్నది మొత్తం చారిటీకి రాసిచ్చేశాడు.
ఆయన ఎవరో కాదు.. డ్యూటీ ఫ్రీ షాపర్స్ కంపెనీ కో ఫౌండర్ చార్లెస్ చక్ ఫీనీ. ఆయనకున్న ఆస్తి 58 వేల కోట్లు. తనకున్న 58 వేల కోట్ల ఆస్తిని ఏమాత్రం ఆలోచించకుండా స్వచ్ఛంద సంస్థకు రాసిచ్చేశాడు. అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్ తన చారిటేనే. దాని ద్వారానే ఆయన అన్ని చారిటీలకు తన యావదాస్తిని రాసిచ్చేశాడు.
ఇక తను, తన భార్య జీవనం కోసం కేవలం 14 కోట్లను మాత్రం తనతో ఉంచుకున్నాడు ఫీనీ. నిజానికి తన యావదాస్తిని చారిటీలకు విరాళంగా ఇస్తానని 8 ఏళ్ల క్రితమే చక్ ప్రకటించాడు. మాట ప్రకారమే తన ఆస్తిని దానం చేశాడు.
నేను బతికుండగానే నా యావదాస్తిని దానం చేయాలనుకున్నా. ఆ కల నెరవేరింది. సంపాదించడంలో ఆనందం ఉండదు. దాన్ని దానం చేయడంలో ఆనందం ఉంటుంది. దాన్ని మనం మాటల్లో చెప్పలేం. మీకూ అటువంటి ఆనందం కావాలంటే దానం చేసి చూడండి.. అంటూ చార్లెస్ ఫోర్బ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక.. తన యావదాస్తిని దానం చేసిన తర్వాత సాధారణ జీవితాన్ని అనుభవిస్తున్నాడు చార్లెస్. ఆయన ప్రస్తుతం తన భార్యతో కలిసి యూఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. తన చివరి మజిలీని ఎంతో ఆనందంగా తన భార్యతో కలిసి గడుపుతున్నాడు.
ఇక.. చార్లెస్.. డ్యూటీ ఫ్రీ షాపర్స్ అనే కంపెనీని 1960లో ప్రారంభించాడు. కంపెనీ లాభాల్లోకి రావడం ప్రారంభం కాగానే.. చార్లెస్ కంపెనీ తరుపున విరాళాలు ఇస్తుండేవాడు. అప్పుడప్పుడు విరాళాలు ఇస్తూ ఉన్న చార్లెస్ ఒకేసారి యావదాస్తిని దానం చేశాడు.
నిజానికి వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటి అపర కుబేరుల దాతృత్వానికి స్ఫూర్తి ప్రదాత చార్లెసే. ఆయన్ను చూసే వాళ్లు కూడా దానధర్మాలు చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్లే కాదు.. చాలామందికి చార్లెస్ స్ఫూర్తి ప్రదాత. దానంలో చార్లెస్ ను జేమ్స్ బాండ్ అని అందరూ పిలుస్తుంటారు.