NTR – ANR: నటరత్న ఎన్టీఆర్, నాట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుల మధ్య 1974 అక్టోబర్లో ఒక ఆసక్తి కరమైన పోటీ జరిగింది. ఎన్టీఆర్ నటించిన నిప్పు లాంటి మనిషి చిత్రం ఆ నెలలోనే విడుదలైంది. సరిగ్గా వారం రోజుల తర్వాత ఏఎన్నార్ నటించిన దొరబాబు సినిమా రిలీజైంది. అంతకుముందు ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడినా అవన్నీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలే. కలర్ చిత్రాలతో ఈ అగ్ర హీరోలు పోటీ పడడం అదే ప్రథమం. ఇకపోతే హిందీలో అమితాబ్ నటించిన జింజర్ సినిమాకు రీమేక్ నిప్పు లాంటి మనిషి. ఇందులో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. లత హీరోయిన్ గా నటించినా ఒక్క సాంగ్ లోనూ ఆయనతో లేకపోవడం గమనార్హం.
ఇకపోతే మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన దొరబాబు చిత్రంలో ఏఎన్నార్ చాలా స్టైలిస్ట్ గా, వివిధ కాస్ట్యూమ్స్ లో కన్పిస్తారు. మంజుల కథానాయిక. అక్కినేని చివరి సినిమా ఇదే అనే ప్రచారంతో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేసుకొని ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. నిప్పు లాంటి మనిషి చిత్రం శత దినోత్సవంను విజయవాడలోనూ, దొరబాబు వంద రోజుల వేడుక చెన్నైలోనూ జరిగాయి. ఈరెండు వేడుకలకు భానుమతి ముఖ్య అతిథిగా రావడం విశేషం.