ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా పదవి అనేది చాలా అవసరం. పదవి లేని నాయకుడు పార్టీలో ఎక్కువ కాలం తన మనుగడ సాగించలేడు అనేది సత్యం. అందుకే నాయకులు పదవుల కోసం ఎంతకైనా సిద్ధపడుతారు, అంతకు మించి లాబీయింగ్ కూడా చేస్తారు. అలాంటి నేతల గోల భరించలేక అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కొన్ని పదవులను సృష్టిస్తాయి. వాటినే నామినేటెడ్ పోస్ట్లు అంటారు. అవి దక్కించుకోవాలంటే రాజకీయ బలమే కాదు అనేక సమీకరణాలు కూడా కలిసి రావాలి.
విశాఖపట్నం VMRDA విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పదవి కూడా అలాంటిదే. కేవలం విశాఖపట్నం సిటీ కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కూడా ఇందులో భాగం. ఈ పదవిలో వుండే ఛైర్మెన్ చుట్టూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుతారు. అసలే రాజధాని కాబోతున్న ప్రాంతం కావటంతో ఇప్పటికే రియల్ ఎస్టేట్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇలాంటి కీలకమైన పోస్ట్ కోసం సాధారణంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతుంది, కానీ విచిత్రం ఏమిటంటే విశాఖ నేతలు అసలు ఈ పదవి మాకొద్దు బాబోయ్ అంటూ దూరంగా వెళ్తున్నట్లు తెలుస్తుంది. దానికి కారణం లేకపోలేదు, ఇందులో పనిచేసిన నేతకు తర్వాత రాజకీయ భవిష్యత్తు లేకుండా పోవటమే, మొన్నటి దాక ద్రోణంరాజు శ్రీనివాస్ ఉన్నారు. కేవలం ఈ పదవి కాలం ఏడాది కావటంతో ద్రోణంరాజు వైదొలిపోయాడు, అప్పటినుండి నిన్నటిదాకా ఆయనకు వైసీపీ పార్టీ ఎలాంటి పదవి ఇవ్వలేదు.
గతంలో ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ కూడా హుడా చైర్మన్ గా పనిచేశాడు. ఆ పదవిలోకి రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీ గా, కాంగ్రెస్ లో కీలక నేతగా చక్రం తిప్పాడు. ఆ పదవి నుండి దిగిన తర్వాత ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిచి ఇక తన రాజకీయ జీవితాన్ని వదిలిపెట్టడు. టీడీపీ పార్టీ అధికారంలో వున్నప్పుడు అదే పదవిని ఎంవీవీఎస్ మూర్తి నిర్వహించాడు. ఆ తర్వాత ఆయన కూడా రాజకీయాల నుండి పక్కకు తప్పుకున్నాడు. గతంలో వైఎస్సార్ సీఎం గా వున్నా కాలంలో రవి అనే నేతకు ఆ పదవి ఇచ్చారు. అప్పట్లో రవి హవా చూస్తే పార్టీలో కీలక నేతగా ఎదుగుతాడనే అనుకున్నారు, కానీ అదేమీ జరగకపోగా కనీసం అతన్ని పట్టించుకున్న నాధుడు లేడు. ఇప్పుడు వైస్సార్సీపీ లో ఉన్నకాని ఎలాంటి పదవి లేదు. దీనితో విశాఖ పదవి లో కూర్చున్న నేతకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే సెంటిమెంట్ బలంగా పడింది.