దివ్య వాణికీ, షర్మిల అలాగే విజయమ్మ, సునీతలకు పోలికేంటి.? తెలుగుదేశం పార్టీపై నానా రకాల ఆరోపణలు చేస్తూ దివ్య వాణి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కి స్వయానా తల్లి. షర్మిల, వైఎస్ జగన్ సోదరి. సునీత, వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి కుమార్తె.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేశారంటే.. అది కేవలం సునీత మాత్రమే. ఆమె కూడా నేరుగా వైసీపీ మీద విమర్శలు చేయలేదు. తన తండ్రి హత్యకు సంబంధించి కొన్ని అనుమానాల్ని వైసీపీ నేతల మీద వ్యక్తం చేశారంతే.
ఇక, వైసీపీలో తనకు ప్రాధాన్యత దక్కలేదని ఏనాడూ ఆరోపించలేదు షర్మిల. షర్మిలకు పదవులు ఇవ్వలేదనే విమర్శలు రావడంతో, ‘నేను అడగలేదు.. వాళ్ళు ఇవ్వలేదు..’ అని మాత్రమే అన్నారు షర్మిల. అయితే, వైసీపీ ముఖ్య నేత, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం, ‘షర్మిల మేం చెప్పిన మాట వినలేదు..’ అని మాత్రం అన్నారు. అది షర్మిలకు ఒకింత బాధ కలిగించిన మాట వాస్తవం.
దివ్య వాణి ఎప్పుడైతే టీడీపీని వీడారో, ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు.. షర్మిల, విజయమ్మ, సునీత ఉదంతాల్ని తెరపైకి తెస్తున్నారు. అంతలా వైసీపీ, తెలుగుదేశం పార్టీని ర్యాగింగ్ చేస్తోంది మరి.!
రాజకీయ నాయకులు పార్టీలు మార్చడంలో వింతేమీ లేదు. పార్టీ మార్చే క్రమంలో విమర్శలు చేయడమూ కొత్తేమీ కాదు. గతంలో రోజా అయినా, ఇప్పుడు దివ్య వాణి అయినా, రేపు ఇంకొకరైనా అంతే. గతంలో వైసీపీ నేతగా పనిచేసిన భూమా అఖిలప్రియ, ఆ పార్టీని వీడే క్రమంలో వైఎస్ జగన్ మీద చేసిన ఆరోపణలు అందరికీ గుర్తుండే వుటాయ్. రాజకీయాలే అంత.