Drushayam 3: దృశ్యం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. మలయాళం తెలుగు హిందీ భాషల్లో విడుదల అయిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. ఇప్పటికే విడుదలైన పార్ట్ 1, పార్ట్ 2 మంచి విజయం సాధించడంతో ప్రేక్షకులు ఈ సిరీస్ లో రాబోతున్న మూడవ సినిమా దృశ్యం 3 కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దృశ్యం 3 సినిమాపై ఇండస్ట్రీలో అలాగే ప్రేక్షకులలో భారీగా క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వెంకటేశ్ హీరోగా శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన దృశ్యం వెంకటేశ్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో రూపొందిన దృశ్యం 2 హిట్ గా నిలిచాయి.
అలాగే హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ నిషికాంత్ కామత్ తెరకెక్కించిన దృశ్యం 1, అజయ్ దేవగణ్, డైరెక్టర్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్‌లో వచ్చిన దృశ్యం 2, సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ సిరీస్‌లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న విషయం తెలిసిందే. మూడవ భాగంలోనూ మోహన్ లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో దృశ్యం 3 ఉంటుందని అజయ్ దేవ్‌గణ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై తాజాగా జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు, హిందీ భాషల్లోనూ దృశ్యం 3 సినిమా వస్తుంది. స్క్రిప్ట్ పని పూర్తి అయ్యాక హిందీ మూవీ టీమ్ కు ఇస్తాను. అక్కడి సంస్కృతి, నేటివిటీకి తగ్గట్టు వాళ్లు కథలో మార్పులు చేసుకుంటారు. మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3 సినిమాని చిత్రీకరించడం సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచన ఉంది అని స్పష్టం చేసారు. దృశ్యం 3 తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగణ్ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు.