తెలంగాణలో ఉన్న ప్రతి జాగకు సంబంధించిన వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి భూమి వివరాలను ఆన్ లైన్ లో చేసేందుకు ఆధికారులను ఆదేశించింది. అధికారులు కూడా వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. దసరా వరకు ఎట్టిపరిస్థితుల్లో అన్ని వివరాలు ఆన్ లైన్ కి ఎక్కితే.. వాటన్నింటినీ.. ధరణి వెబ్ సైట్ లో పొందుపరిచి ధరణి పోర్టల్ ను ఆరోజే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావించారు.
కానీ.. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ధరణి పోర్టల్ లాంచ్ ను వాయిదా వేసింది ప్రభుత్వం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా ఇంకొన్ని రోజులు వాయిదా పడనున్నాయి.
ఈనెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్.. ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం కానున్నాయి.
ధరణి పోర్టల్ లో అన్ని వివరాలు నమోదు చేశాక.. ప్రపంచంలో ఎక్కడ ఉండి అయినా తెలంగాణలోని భూమికి సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవచ్చు. అత్యంత పారదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.
ఒకసారి ధరణి పోర్టల్ లాంచ్ అయ్యాక.. తెలంగాణ వ్యాప్తంగా జరిగే అన్ని రకాల రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. దీనిక సంబంధించి రెవెన్యూ సిబ్బందికి కూడా ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.