ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుపతి విషయంలో అత్యంత దుర్మార్గమైన రీతిలో వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. ‘తిరుపతికి ఎవరూ రారు..’ అంటూ ఆ వీడియోలో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంత కాలం చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అయితే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణమైపోయాయి. మార్ఫింగ్ చేయడం, ఎడిటింగ్ చేయడం.. వీటి ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లడం అనేది ఓ కామన్ పొలిటికల్ ట్రెండ్ అయి కూర్చుంది ఇటీవలి కాలంలో.
ఏ రాజకీయ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీడీపీ హయాంలో, వైసీపీ నేతల మీద ఈ తరహా కేసులు చాలానే పెట్టారు. ఇప్పుడు అదే పని వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. వైసీపీ నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో, మాజీ మంత్రి దేవినేని ఉమ మీద ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇంకేముంది.? టీడీపీ రాజకీయ రచ్చ షురూ చేసింది. నిజానికి, గడచిన రెండేళ్ళలో చాలామంది టీడీపీ నేతల మీద కేసులు నమోదైనా, ఏ కేసులోనూ టీడీపీ నేతల్ని దోషులుగా వైసీపీ ప్రభుత్వం నిరూపించలేకపోయిందన్న విమర్శ వుంది. కోర్టులు, విచారణలు.. అదో పెద్ద తతంగం. ఇక్కడ ఎవరిది వైఫల్యం.. అన్నది చెప్పడం అంత తేలిక కాదు, సబబు కూడా కాదు. అయితే, రోజుకోరకంగా కొత్త తరహా ఆరోపణలు, కేసులు తెరపైకొస్తుండడం వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం.? అన్న విషయమై ప్రజల్లో కొంత ఆత్మ విమర్శ మొదలైన మాట వాస్తవం.
కాగా, తాజాగా తన మీద నమోదైన కేసుతో, లోలోపల పండగ చేసుకుంటున్నారు దేవినేని ఉమ. తనను అంతా మర్చిపోయిన ఈ తరుణంలో ఈ కేసుతో మళ్ళీ పొలిటికల్‌గా తన పాపులారిటీ పెరుగుతుందన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అందుకేనేమో, ఆయన ఈ కేసు విషయంలో కాస్తంత ఓవర్ రియాక్షన్ ఇస్తున్నారు. రాజకీయం అంటేనే అంత. దీన్ని భయం అనలేం.. ధైర్యం అనీ అనలేం.. రాజకీయంగా దిగజారుడుతనం.. అని అనాలేమో.