వీడియో మార్ఫింగ్‌కి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఎలక్ట్రానిక్ ఫోర్జరీ కేసు నమోదైంది టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద. ఇటీవల ఆయనకు నోటీసులు కూడా పంపింది ఏపీ సీఐడీ, విచారణకు హాజరు కావాలని కోరుతూ. అయితే, దేవినేని ఉమ అప్పట్లో విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇంకోసారి ఏపీ సీఐడీ, దేవినేని ఉమకి నోటీసులు అందించేందుకు ఆయన ఇంటికి వెళ్ళింది. అయితే, దేవినేని ఉమ ఇంట్లో లేకపోవడమే కాదు, ప్రస్తుతం ఆయన ఆచూకీ కూడా దొరకడంలేదు. టీడీపీ నేతలు ఇలా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు, అరెస్టయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల టీడీపీ నేత కూన రవికుమార్ కూడా ఇలాగే అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆ తర్వాత లొంగిపోయారు. మరి, దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలో ఏం జరుగుతుంది.? తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఓ ఫేక్ వీడియోని దేవినేని ఉమ ప్రెస్ మీట్‌లో ప్రదర్శించారన్నది అభియోగం. ఈ మేరకు వైసీపీ నేత ఒకరు చేసిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా, ఈ వ్యవహారంపై పరోక్షంగా స్పందిస్తూ, అధికార పార్టీ.. విపక్షాలపై కుట్రలు పన్నుతోందనీ, సీఐడీని ఉసిగొల్పుతోందనీ, సీఐడీ నోటీసులకు అర్థమే మారిపోయిందనీ, వాటిని తాము పట్టించుకోవడం మానేశామనీ, చూసి పక్కన పడేస్తున్నామనీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఈ మధ్యనే తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు. సరే, వ్యవస్థల్ని అధికారంలో వున్నోళ్ళు ఎలా వాడుకుంటున్నారు.? టీడీపీ హయాంలో ఏం జరిగింది.? అన్నది వేరే చర్చ. తమకేమీ జరగదన్న గట్టి నమ్మకం వున్నప్పుడు విచారణ ఎదుర్కొంటే సరిపోయేది. దేవినేని ఉమ లాంటి సీనియర్ నేత మిస్సింగ్ అంటే.. అది ఆయనకే అవమానకరం.